జులై చివరి నాటికి నాడు-నేడు పనులు పూర్తి కావాలని, సచివాలయాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్.. సిబ్బందిని ఆదేశించారు. అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలపై క్షేత్ర స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కోవిడ్-19 నివారణ చర్యలు, సచివాలయాల నిర్మాణం, రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు, వెల్‌నెస్ సెంటర్లు నిర్మాణం, నాడు - నేడు పనులు, మొక్కలు నాటడం, చెరువుల శుద్ధి, పారిశుద్ధ్యం అంశాలపై చర్చించారు.
ఎక్కడైనా పాఠశాలల్లో క్వారంటైన్ సెంటర్లు ఉంటే, వెంటనే వాటిని ఖాళీ చేయించి పనులు ప్రారంభించాలని, ప్రహరీ గోడల నిర్మాణాన్ని పూర్తి చేయాలని చెప్పారు. గ్రామాల్లో సచివాలయాలు, వెల్‌నెస్ సెంటర్లు, రైతు భరోసా కేంద్రాల నిర్మాణాన్ని వేగవంతం చేసి, ఇచ్చిన గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.