Vizianagaram Multi Purpose Stadium latest updates: క్రీడలు దేశ సంస్కృతిని, సాంప్రదాయలను ప్రపంచానికి చాటుతాయి. అంతేకాదు, పిల్లల దైనందిన జీవితంలో ఒక భాగమై.. ఆరోగ్యానికి, వినోదానికి, బుద్ధి వికాసానికి, చురుకుదనానికి, భవిష్యత్తులో గొప్ప వ్యక్తులుగా పేరును సాధించేందుకు ముఖ్య పాత్రను పోషిస్తాయి. దాంతోపాటు పిల్లల్లో చక్కటి క్రమశిక్షణ, పట్టుదల, కార్యదీక్ష, సమయస్ఫూర్తి, ఐకమత్యం వంటి గుణాలను పెంపొందిస్తాయి. అప్పుడే పిల్లలు ఆ ఆటల్లో మంచి ఫలితాలను సాధిస్తారు. అటువంటి క్రీడాకారుల కోసం విజయనగరం జిల్లాలో గత ప్రభుత్వ హయంలో మల్టీపర్పస్ క్రీడా మైదానికి బీజం పడడంతో ఆ ప్రాంతంలోని ప్రజలు, పిల్లలు, యువకులు, ఆటలకు శిక్షణనిచ్చి నిపుణులు, క్రీడాకారులు ఎంతో ఆనందపడ్డారు. అంతలోనే ప్రభుత్వం మారింది.. నిధుల్లేక మైదానం పనులు ఆగిపోయాయి. దీంతో క్రీడాకారులకు సరైన మైదానం లేక, కనీస వసతుల్లేక నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రూ.6కోట్లతో నిర్మించారు..రూ.30 లక్షల్లేక నిలిపివేశారు..విజయనగరం జిల్లాలో గత ప్రభుత్వ హయంలో విజ్జీ క్రీడా మైదానంలో మల్టీపర్పస్ మైదానికి బీజం పడింది. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తంగా రూ.6 కోట్లు చొప్పున నిధులను కేటాయించాయి. ఈ మేరకు గతేడాదే 90 శాతం పనులు కూడా పూర్తయ్యాయి. ఇంకా 10శాతం పనులే చేపట్టాల్సి ఉంది. అందుకు సుమారు రూ.30 లక్షల నిధులు కావాలి.. కానీ, నిధులు మంజూరు కాక పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. ప్రస్తుతం ఆ మైదానంలో వ్యాయామం చేస్తున్న క్రీడాకారులకు తిప్పలు మొదలయ్యాయి.
2018-19లో విజ్జీలో శంకుస్థాపన.. విజయనగరం ఉమ్మడి జిల్లాలోని అన్ని మైదానాలు అవుట్‌డోర్ ఆటలకే ఉపయోగపడుతున్నాయి. ఇండోర్ మైదానం లేకపోవటంతో వర్షాలు, ఇతరాత్ర సమస్యలు వచ్చినప్పుడు క్రీడాకారులు ఇబ్బందులు పడుతున్నారని అధికారులు గుర్తించారు. దీంతో 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.6 కోట్ల రూపాయలతో మల్టీ పర్పస్ ఇండోర్ మైదానానికి విజ్జీలో అప్పటి పాలకులు శంకుస్థాపన చేసి, పనులను ప్రారంభించారు. దీనికి కేంద్ర ప్రభుత్వం రూ.3 కోట్లు కేటాయించగా, రాష్ట్ర ప్రభుత్వం రూ.3 కోట్లను కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వ వాటా తరఫున విజయనగరం పురపాలక సంఘం రూ. 25 లక్షలు, అప్పటి పార్లమెంట్ సభ్యుల నుంచి రూ. 25 లక్షలు, విశాఖపట్నం మెట్రో అథారిటీ రూ.2 కోట్లు, క్రీడా శాఖ రూ. 50 లక్షల రూపాయల చొప్పున నిధులను కేటాయించాయి.