Problems at Bhogapuram Airport: విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్వాసితులు మూటాముల్లె సర్దుకొని ఊళ్లు విడిచి వెళుతున్నారు. ఇక్కడ విమానాశ్రయం నిర్మించాలని 2014లో ప్రభుత్వం నిర్ణయించింది. కంచేరుపాలెం, కవులవాడ, గూడెపువలస, ఎ.రావివలస, సవరవిల్లి, రావాడ రెవెన్యూ గ్రామాల పరిధిలో.. 15వేల ఎకరాల సేకరణకు తొలుత నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ ప్రతిపాదనపై స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో.. 5 వేల 311 ఎకరాలకు తగ్గించింది. చివరికి 2వేల 644 ఎకరాల్లోనే విమానాశ్రయం నిర్మించేలా ప్రణాళిక మార్చింది.
వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక 2వేల 200 ఎకరాల్లో విమానాశ్రయం నిర్మించాలని నిర్ణయించింది. ఈమేరకు పీపీపీ పద్ధతిలో నిర్మాణం పూర్తిచేసేలా జీఎంఆర్ సంస్థతో ఒప్పందం చేసుకుంది. భూములు సేకరించిన ప్రాంతంలో నివాసముంటున్న వారిని తరలించే పనులను ఇటీవల ముమ్మరం చేసింది. ఇళ్లు ఖాళీ చేయాలంటూ మూణ్నాలుగు రోజులుగా నిర్వాసితులపై అధికారులు తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. పోలీసు బందోబస్తు నడుమ వాహనాలు ఏర్పాటు చేసి మరీ నిర్వాసితులను తరలిస్తున్నారు.
భోగాపురం విమానాశ్రయ నిర్వాసిత గ్రామాలైన మరడపాలెంలో 223 కుటుంబాలు, ముడసర్లపేటకు చెందిన 33 కుటుంబాలకు.. పోలిపల్లి రెవెన్యూ పరిధిలోని లింగాలవలసలో పునారావాస కాలనీ నిర్మిస్తున్నారు. బొల్లింకలపాలెం నుంచి 55 కుటుంబాలు, రెల్లిపేటకు చెందిన 85 కుటుంబాలకు.. గూడెపువలసలో కాలనీ ఏర్పాటుచేశారు. అయితే ఈ కాలనీల్లో 70శాతం ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. అధికారులు మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా.. నిర్దయగా గ్రామాలను ఖాళీ చేయిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో గుండెల నిండా బాధతో.. నిర్వాసితులు పునరావాస కాలనీలకు చేరుతున్నారు. చేసేది లేక ఆయా కాలనీల్లోని అసంపూర్తి నిర్మాణాల పక్కనే పాకలు వేసుకుంటున్నారు. మరికొందరు బిక్కుబిక్కుమంటూ ఆరుబయటే కాలం వెళ్లదీస్తున్నారు.
నిర్వాసిత గ్రామాలకు చెందిన మరికొందరు ప్రజలు.. ఇంకో రకమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ గ్రామాల పరిధిలోని సుమారు 80 కుటుంబాల వారు.. ఉపాధి కోసం కొన్నేళ్లుగా విజయవాడ, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లో ఉంటున్నారు. తరచూ సొంతూళ్లకు వచ్చి వెళ్తుంటారు. ఆధార్, రేషన్, ఓటరు కార్డులన్నీ ఉన్నా.. వీళ్లు స్థానికులు కాదంటూ పునరావాస కాలనీలో స్థలాలు కేటాయించలేదు. ప్రస్తుతం ఇళ్ల కూల్చివేత కొనసాగుతుండటంతో.. 15 రోజులుగా ఉపాధి వదులుకొని కుటుంబాలతో సహా స్వగ్రామాలకు వచ్చారు. తమకు పరిహారం ఇస్తేనే గ్రామాలు ఖాళీ చేస్తామని తెగేసి చెబుతున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంపై మండిపడుతున్నారు.