గ్రామాల్లో పరిశుభ్రతపై సచివాలయ సిబ్బంది దృష్టిసారించాలని.. విజయనగరం కలెక్టర్ హరి జవహర్ లాల్ ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశానుసారం రూరల్ మండలంలోని దుప్పాడ, జొన్నవలస సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సంక్షేమ పథకాల అమలు, ఇ - సేవ వినతుల పరిష్కారం, ఉద్యోగుల హాజరు తదితర అంశాలను పరిశీలించి.. సిబ్బందికి పలు సూచనలు చేశారు. గ్రామాలను పరిశుభ్రంగా, ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దేందుకు కృషిచేయాలన్నారు. ప్రజలను భాగస్వాములను చేస్తూ.. పరిశుభ్రత ఆవశ్యకతపై అవగాహన కలిగించడం ముఖ్యమని పేర్కొన్నారు. జలకళ దరఖాస్తులను త్వరగా పరిష్కరించి బోర్లు వేసేలా చర్యలు చేపట్టాలన్నారు.
జొన్నవలసలో రోడ్డు పక్కన దారిపొడవునా ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు కుప్పలుగా పోసి ఉండటంపై కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వ్యర్థాలను రోడ్లపై పారబోసే షాపులకు నోటీసులిచ్చి.. వారిపై చర్యలు చేపడతామని హెచ్చరించాలన్నారు. ఎంతో మంది సిబ్బంది, వాలంటీర్లు సచివాలయంలో ఉంటూ.. గ్రామంలో మార్పు తీసుకురాలేకపోతే ఏం ప్రయోజనమని ప్రశ్నించారు. గ్రామంలోని ఫ్లెక్సీలు, ఇళ్ల వద్ద ఏర్పాటు చేసిన బ్యానర్లు తొలగించాలని ఆదేశించారు. చెరువుల పరిసరాలు బాగుచేసి అక్కడ మొక్కలు నాటే అవకాశం పరిశీలించాలన్నారు. సచివాలయంలోనూ మొక్కలు నాటకపోవడాన్ని తప్పుపట్టారు. వచ్చే జనవరిలో తాను మళ్లీ సందర్శించే నాటికి ఖచ్చితంగా మార్పు కనిపించాలన్నారు.