విజయనగరం జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగడానికి పోలీసు శాఖ చర్యలు చేపట్టింది. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా దృష్టి సారించింది. జిల్లాలో చేపట్టిన భద్రతా చర్యల వివరాలను ఎస్పీ బి.రాజకుమారి, అదనపు ఎస్పీ పి.సత్యనారాయణ వెల్లడించారు.
- శుక్రవారం నుంచి జిల్లావ్యాప్తంగా సెక్షన్-30 అమలు. ఫిబ్రవరి 27 వరకు ఉంటుంది.
- బహిరంగ సభలు, ర్యాలీలు, సమావేశాలు, ప్రచార వాహనాలకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, డీఎస్పీ నుంచి అనుమతులు తప్పనిసరి.
- ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు మద్యం, సారా, గంజాయి, నగదు, బహుమతుల అక్రమ రవాణాను నియంత్రించేందుకు 15 చెక్‌పోస్టుల ఏర్పాటు. ఎస్‌ఈబీ ఆధ్వర్యంలో తనిఖీలు చేస్తారు.
- అతి సమస్యాత్మక, సమస్యాత్మక గ్రామాలను డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు తరచూ సందర్శించి గొడవలకు దిగకుండా స్థానికులకు అవగాహన కల్పిస్తారు.
- బ్యాంకుల రక్షణకు వినియోగించే లైసెన్స్‌డ్ తుపాకులు మినహా 526 తుపాకుల స్వాధీనం.
- నాన్ బెయిలబుల్ వారెంట్లను అమలు చేసేందుకు ప్రతి సర్కిల్‌లోనూ ప్రత్యేక బృందాలు.
- ఎన్నికల నేపథ్యంలో ఇప్పటివరకు 1281 మందిపై బైండోవర్ కేసులు. రౌడీషీట్లు కలిగిన 87 మందిని బైండోవర్ చేసి వారిపై ప్రత్యేక నిఘా ఉంచడం.
- విశ్రాంత ఉద్యోగులు, మాజీ సైనికోద్యోగులు, ఇతర యూనిఫారం సర్వీసు వ్యక్తుల సేవలను వినియోగించుకోవడం.
- వాహనాల తనిఖీ, నామపత్రాల దాఖలు, పోలింగ్ సమయంలో బాడీవార్న్ కెమెరాల వినియోగం.
- చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని నియంత్రించేందుకు ప్రత్యేక స్ట్రైకింగ్ ఫోర్స్, రూట్ మొబైల్స్ బృందాల ఏర్పాటు.
- ఎన్నికల ముందు, తరువాత ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక కార్యాచరణ.
- ఎన్నికల నిర్వహణకు 2,356 మంది పోలీసుల సేవల వినియోగం.
- మద్యం, నగదు అక్రమ రవాణా, సారా అమ్మకాలపై సమాచారం ఉంటే డయల్ -100, పోలీసు వాట్సాప్ 6309898989కు సమాచారం అందించవచ్చు.