రండి బాబూ..రండి. రండమ్మా... రండి. కిలో ప్లాస్టిక్‌కు... కోడిగుడ్లు... మిఠాయిలు... ఏది కావాలో మీ ఇష్టం... కిలో ప్లాస్టిక్ తీసుకురండి... నచ్చివవి తీసుకెళ్లండి. ఇది విజయనగరం నగరపాలక సంస్థ చేపట్టిన ప్రచారం. ఒక్కసారి వినియోగించే ప్లాస్టిక్ తెచ్చినవారికి నగరపాలక సంస్థ అధికారులు ఇస్తున్న ప్రత్యేక కానుకలివి. ఈ ప్రచారానికి వస్తున్న స్పందన అంతా ఇంతా కాదు..!
విజయనగరంలో ప్లాస్టిక్ వినియోగంతో జల కాలుష్యం పెరిగిపోతోంది. ఈ విషయాన్ని ఇటీవల కొన్ని సంస్థలు సైతం వెల్లడించాయి. ఈ దుష్పరిణామాలు భావితరాలపై పడకుండా ఉండేందుకు అధికారులు కొత్తపంథాలో వెళ్తున్నారు. కిలో ప్లాస్టిక్ వ్యర్థాలు తెస్తే... పావుకేజీ మిఠాయి లేదా ఆరు కోడిగుడ్లు ఇస్తున్నారు. నగరపాలకసంస్థ, రోటరీక్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు.
ప్లాస్టిక్‌కు మిఠాయి లేదా, గుడ్లిచ్చే కార్యక్రమాన్ని అన్ని వార్డుల్లోనూ 5 నెలల పాటు అమలు చేస్తామని రోటరీ క్లబ్ ప్రతినిధులు అంటున్నారు. నగరపాలక సంస్థ పరిధిలోని గృహాల్లో ఉన్న ప్లాస్టిక్ మొత్తాన్ని సేకరించిన తర్వాత... రెండో దశగా వస్త్ర సంచులు అందజేస్తామని చెప్పారు.