విజయనగరం ఉత్సవాల్లో భాగంగా విజయనగరంలోని మహారాజ సంగీత, నృత్య కళాశాల ఆవరణలో ఫల-పుష్ప ప్రదర్శన ఏర్పటు చేశారు. ఉద్యానశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రదర్శన ప్రవేశ ద్వారం వద్ద వివిధ రకాల పుష్పాలు, పండ్లతో సుందరంగా తీర్చిదిద్దిన ఎడ్లబండి.. ప్రకృతి అందాలతో స్వాగతం పలుకుతోంది. పైడితల్లి జాతరను పురస్కరించుకుని రూపొందించిన అమ్మవారి సైతిక శిల్పం ఇట్టే ఆకట్టుకుంటోంది. ప్రదర్శన మండపంలోకి ప్రవేశించగానే రంగు రంగుల గులాబీలు, అలంకరణ పుష్పాలు కనువిందు చేస్తున్నాయి. కోల్కతా, బెంగళూరు నుంచి తీసుకొచ్చిన వివిధ రకాల పూలు ముచ్చట గొలుపుతున్నాయి. జిల్లా రైతులు ఆధునిక పద్ధతుల్లో పండించిన మేలు రకాలైన కూరగాయలు, ఫలాలను సైతం ప్రదర్శనకు ఉంచారు. ఒకేచోట కొలువుదీరిన పలు రకాల కూరగాయలు, ఫలాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. విశాఖ బొన్సాయి సొసైటీ వారి సహకారంతో ఏర్పాటు చేసిన మరుగుజ్జు మొక్కలు మరింత ఆకర్షణగా నిలిచాయి.
కనువిందు చేస్తోన్న ఆకృతులు
రకరకాల కూరగాయలతో రూపొందించిన వివిధ ఆకృతులు ప్రదర్శనలో ఆకర్షణగా నిలిచాయి. ఆకుకూరలు, కాకర, వంగ, బెండ, దోస, గుమ్మడి, కర్బూజ, బీర, క్యారెట్, చిలగడదుంప వంటి 30రకాల కూరగాయలు, ఫలాలతో తీర్చిదిద్దిన ఆకృతులు కనువిందు చేస్తున్నాయి. మంచుతో తీర్చిదిద్దిన శివుని ఆకృతి ఆధ్యాత్మిక భావాన్ని పెంచుతోంది. విజయనగరం సాహిత్య వైభవాన్ని చాటిచెప్పే వివిధ రకాల వాయిద్య, సంగీత పరికరాలు సైతం ఈ ప్రదర్శనలో కొలువుదీరాయి.