మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్ పదవిపై హైకోర్టు తీర్పు, వైకాపా నేతల వ్యాఖ్యలపై విజయనగరం జిల్లా తెదేపా నేతలు స్పందించారు. తెదేపా మాజీ ఎమ్మెల్సీ ద్వారాపురెడ్డి జగదీష్, అరకు తెదేపా పార్లమెంట్ అధ్యక్షురాలు గుమ్మడి సంధ్యారాణి విజయనగరంలోని అశోక్ బంగ్లాలో సమావేశం నిర్వహించారు. తొలుత ద్వారాపురెడ్డి జగదీష్ మాట్లాడుతూ... మాన్సాస్ ట్రస్టు చైర్మన్‌పై ప్రభుత్వం జారీ చేసిన 71, 72, 73, 74 జీవోలు తప్పుడు ఆలోచనతో ఇచ్చిందని రుజువైందన్నారు.
వాస్తవాలు పక్కనపెట్టి మంత్రి వెల్లంపల్లి, ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. మాన్సాస్ ట్రస్టుల్లో తప్పులు జరిగితే సంచైత ఛైర్మన్‌గా 14 నెలలు ట్రస్ట్ వారి అధీనంలో ఉన్నప్పుడు ఎందుకు విచారణ చేయలేదని ఆయన ప్రశ్నించారు. తూర్పు గోదావరిజిల్లాలోని ట్రస్టు భూముల్లో ఇసుక తవ్వకాలకు సంచైత సంతకం పెట్టారని గుర్తు చేసిన ఆయన... ఆమెను అరెస్ట్ చేయగలరా..? అని ఆయన ధ్వజమెత్తారు.