డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ క్రింద 2434 వ్యాధులకు చికిత్సనందించే ప్రక్రియను రాష్ట్రమంతా వర్తింపజేసే పథకాన్ని ముఖ్యమంత్రి జగన్ వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ వర్చువల్ కాన్ఫరెన్స్‌లో విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ పాల్గొన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యమని, దానిని ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలని విజయనగరం కలెక్టర్ అన్నారు.
ఆరోగ్యశ్రీ పథకం క్రింద చికిత్స చేయించుకున్న విజయనగరానికి చెందిన కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఎల్.నాగేశ్వర్రావు, హరి శంకర్, నెల్లిమర్లకు చెందిన బి.సంధ్యతో వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ మాట్లాడారు. వారి ఆరోగ్యంపై వాకబు చేశారు. ఆరోగ్యశ్రీ క్రింద చికిత్సను అందించిన విధానాన్ని, ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మానసికంగా ధైర్యంగా ఉండాలని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆరోగ్యం దెబ్బతింటే, పేదలతోపాటు, మధ్యతరగతి కుటుంబాలు సైతం ఆర్థికంగా తీవ్రంగా దెబ్బ తింటాయన్నారు. అలాంటి పరిస్థితుల్లో, ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం పేదల పాలిట వరమని పేర్కొన్నారు. సుమారు 2434 వ్యాధులకు ప్రభుత్వం ఉచితంగా చికిత్సను అందించడమే కాకుండా, శస్త్రచికిత్స అనంతరం నెలకు రూ.5వేల వరకు ఆరోగ్య ఆసరాను అందిస్తోందని చెప్పారు.