దశాబ్ధ కాలంలో పల్లెల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. గ్రామాల అభివృద్దికి ప్రభుత్వాలు చేస్తోన్న ప్రయత్నాలు కొంత మేర సత్ఫలితాలను ఇస్తున్నాయి. విజయనగరం జిల్లాలో ఇప్పటికీ గ్రామాల్లో నివసిస్తున్న వారే ఎక్కువ. అయితే.. పెరుగుతున్న జనాభా, వారి అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులు లేవని స్పష్టంగా తెలుస్తోంది. మన పల్లె జీవనం, ప్రజల స్థితిగతులు ఎలా ఉన్నాయో పరిశీలిస్తే..
మన ఇంట సింగారం.. పల్లె బంగారం - Vizianagaram news update
పదేళ్లలో విజయనగరం జిల్లాలో ఎన్నో మార్పులు వచ్చాయి. ముఖ్యంగా పల్లెల రూపురేఖలు మారుతున్నాయి. గ్రామాల అభివృద్ధికి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తోన్న పథకాలు ఎంతో దోహదపడ్డాయి. అయితే మౌలిక వసతులు ఇంకా మెరుగుపడాలి.

1. జిల్లాలో 2019 గణాంకాల ప్రకారం 1721 గ్రామీణ రహదారులున్నాయి. ఇవి 3,940.453 కిలోమీటర్లు ఉండగా.. కేవలం 444.737 కి.మీ. మేర మాత్రమే బస్సులు తిరుగుతున్నాయి. 2014-19 మధ్య గ్రామాల్లో రూ.587.36 కోట్లతో 1396.63 కి.మీ.ల రహదారులు నిర్మించారు.
2.బ్యాంకింగ్ సేవలు విస్తరించినా ఇప్పటికీ చాలా గ్రామాలు వీటికి దూరంగానే ఉన్నాయి. జిల్లాలో 307 బ్రాంచులు 147 గ్రామాల్లో ఉన్నాయి. ప్రతి 2 వేల జనాభాకు బ్యాంకు శాఖ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలు బుట్టదాఖలయ్యాయి. బిజినెస్ కరస్పాండెంట్ల ద్వారా కొంత మేరకు సేవలందిస్తున్నారు.
3.జిల్లాలో 2,999 ఆవాసాలు ఉన్నాయి. ఒక వ్యక్తికి రోజుకి 55 లీటర్ల తాగునీరు అందించాలి. 2,042 ఆవాసాలకే ఆ మేరకు అందిస్తున్నారు. కేంద్ర పథకం జల్ జీవన్ మిషన్ ద్వారా 1925 గ్రామాల్లో తాగునీరు అందించడానికి రూ.465 కోట్లతో ప్రతిపాదనలు పంపించారు. ఇందులో భాగంగా 4.20 లక్షల కుళాయి కనెక్షన్లు ఇవ్వనున్నారు. ఈ పనులు పూర్తయితే పూర్తి స్థాయి నీరు అందుతుందని అధికారులు చెబుతున్నారు.
4.జిల్లాలో పెద్దఎత్తున గృహనిర్మాణ పథకాలు అమలు చేయడంతో ఎక్కువ మందికి పక్కా ఇళ్లు సమకూరాయి. 2014-19 మధ్య కాలంలో గ్రామీణంలో 19,545 ఇళ్లు మంజూరయ్యాయి. తాజాగా 98,286 గృహాలు మంజూరు చేశారు. వీటి నిర్మాణాలు ప్రారంభం కావాల్సి ఉంది.
5. 2017లో చేపట్టిన ఓడీఎఫ్ కార్యక్రమంతో విజయనగరం స్వచ్ఛ జిల్లాగా మారింది. అప్పటికీ జిల్లాలో 1.53 లక్షల మరుగుదొడ్లు ఉన్నాయి. ఓడీఎఫ్‌లో 3,23,910 నిర్మించారు. ఇంకా పదివేల వరకు నిర్మించాల్సి ఉంది. వీటి వినియోగంపై 20 శాతం మందికి అవగాహన లోపం ఉన్నట్లు యూనిసెఫ్ గణాంకాలు చెబుతున్నాయి. వీరిలో మార్పు తీసుకురావాల్సి ఉంది.
మార్పు ఇలా...
జనాభా (2018 నాటికి): 25.12 లక్షలు
పంచాయతీలు: 960
2009-10లో సాక్షరభారత్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 7,99,496 మంది నిరక్షరాస్యులున్నట్లు గుర్తించారు. వీరిలో 6,08,017 మందిని అక్షరాస్యులుగా మార్చారు. ప్రసుత్తం జిల్లాలో 1,91,470 మంది నిరక్షరాస్యులున్నట్లు వయోజన విద్యాశాఖ గణాంకాలు చెబుతున్నాయి.
ఇదీ చదవండి:ఆలయ భూముల్లో... అక్రమాల పర్వం