విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అప్రోచ్ రోడ్డు భూ సేకరణ సర్వేను స్థానికులు మరోసారి అడ్డుకున్నారు. గ్రామస్థులు మూకుమ్మడిగా తరలిరావటంతో అధికారులు పెద్దఎత్తున పోలీసులను మోహరించారు. జాతీయ రహదారి నుంచి భోగాపురం విమానాశ్రయ ప్రతిపాదన ప్రాంతానికి నాలుగు వరుసల రహదారి నిర్మాణ పనులు చేపట్టేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. జాతీయ రహదారి అనుసంధాన ప్రాంతం ఎ.రావివలస నుంచి.. గూడేపువలస వరకు సుమారు మూడున్నర కిలోమీటర్ల మేర రహదారిని నిర్మించనున్నారు. ఈ మేరకు బైరెడ్డిపాలెం, గూడెపువలస, కంచేరు, ఎ.రాయవలస గ్రామాల్లో 135ఎకరాల సేకరణకు అధికారులు సమాయత్తమయ్యారు. ఇందులో భాగంగా ఈ నెల 16న బైరెడ్డిపాలెం, ముడసర్లపేట గ్రామాల భూముల్లో సర్వే ప్రారంభించారు. ఆ గ్రామాల ప్రజలు అధికారుల ప్రయత్నాన్ని అడ్డుకున్నారు.
ముడసర్లపేటలో ఉద్రిక్తత.. పోలీసుల మోహరింపు - భోగాపురంలో ఉద్రిక్తత
విజయనగరం జిల్లా ముడసర్లపేటలో ఉద్రిక్తత నెలకొంది. భోగాపురం విమానాశ్రయ అప్రోచ్ రోడ్డు కోసం భూసర్వేకు రెవెన్యూ అధికారులు సిద్ధం కాగా..అక్కడి గ్రామస్థులు అడ్డుకున్నారు. వారు నిరసన వ్యక్తం చేయడంతో...గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు.
అప్రోచ్ రహదారి ఇప్పటికే సేకరించిన భూముల పక్క నుంచి వెళుతుందని గతంలోనే చూపించారు. ఇప్పుడు ఎలా మార్చారని అధికారులను నిలదీశారు. దీంతో అధికారులు చేసేదేమీ లేక వెనుదిరిగారు. మరోసారి రెవెన్యూ అధికారులు ఈ రోజు భూముల సర్వేకు ఉపక్రమించారు. ముడసర్లపేట పరిధిలో 20ఎకరాల సేకరణకు సర్వే చేసేందుకు విమానాశ్రయం ప్రత్యేక అధికారి అప్పలనాయుడు, డిప్యూటీ కలెక్టర్ జయరాం, భోగాపురం తహసీల్దార్ రాజేశ్వరరావు, సిబ్బంది వెళ్లారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు.. ఆ ప్రాంతానికి తరలివచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ భూములను ఇవ్వబోమని సర్వేను అడ్డుకున్నారు. ఉన్న కాస్త భూమిని తీసుకుంటే వీధిని పడాల్సి వస్తుందని.. ఈ పరిస్థితుల్లో భూ సేకరణకు విరమించుకోవాలని అధికారులకు కోరారు. అధికారులు ముందస్తుగా పోలీసు బలగాలను మోహరించారు. అధికారులు గ్రామస్థులకు సర్దిచెప్పటంతో వివాదం సద్దుమణిగింది. గ్రామస్థులను అన్ని విధాలుగా ఒప్పించి..ముందుకెళ్తామని వారి అభిప్రాయాల మేరకు భూసేకరణ చేపడతామని అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి.పాడేరు మాతాశిశు ఆస్పత్రిలో అరకొర వసతులు.. గర్భిణుల అవస్థలు