విజయనగరం జిల్లా మనం- మన పరిశుభ్రత కార్యక్రమానికి మండలానికి రెండు పంచాయతీల చొప్పున మొత్తం 68 గ్రామాలను పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. ఇందులో 90 శాతం ప్రజలు భాగస్వాములైనట్లు, పారిశుద్ధ్యంపై 70 శాతం మందికి అవగాహన వచ్చినట్లు అధికారులు చెబుతున్నా పరిస్థితులు మరోలా ఉన్నాయి.
లోపించిన అవగాహన
ప్రజావగాహన కార్యక్రమాలు నిర్వహించిన దాఖాలాలు లేవు. ఇటకర్లపల్లిలో చెత్త సంపద తయారీ కేంద్రం ఉంది. అనుబంధ గ్రామాలైన పోతాయవలస, పీఎస్ లక్ష్మీపురం 3 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో సేకరించిన చెత్తను ఈ కేంద్రానికి తరలించడం లేదు. పేరిపిలో వానపాములు తక్కువగా ఇవ్వడంతో కంపోస్టు ఎరువు తయారీకి ఇబ్బందికరంగా మారింది.
భాగస్వామ్యం లేక..
ప్రజా భాగస్వామ్యం అంతంతే. ఒక్కో ఇంటికి రోజుకు రూ.2ల చొప్పున ఇవ్వాలని అధికారులు కోరినా.. సగం మంది స్పందించలేదని అక్కడి గ్రామపెద్దలు చెబుతున్నారు. ఇక్కడి చెత్త సంపద కేంద్రంలో ఇప్పటివరకు వానపాములను విడిచిపెట్టలేదు. తడి పొడి చెత్తను వేరు చేసేందుకు ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చెత్తబుట్టల పంపిణీ లేదు.
నిర్వహణ చెత్తపాలు
రహదారులు, వీధులన్నీ శుభ్రంగానే ఉన్నా సేకరించిన చెత్తను మాత్రం సంపదగా మార్చడం లేదు. ఇంటింటికీ హరిత రాయబారులు వచ్చి చెత్తను సేకరిస్తున్నారు. చెత్తశుద్ధి కేంద్రం వద్ద తొట్టెలో వేయకుండా బయటే పారబోస్తున్నారు.
ఎలా వేరు చేసేది..?
తడి, పొడి చెత్త నిర్వహణకు సంబంధించి ఇంటింటా ప్లాస్టిక్ బుట్టలు ఇంకా పంపిణీ కాలేదు. సీతారామునిపేటలోని చెత్త సంపద కేంద్రంలో ఎలాంటి నిర్వహణ పనులు కొనసాగడం లేదు. చెత్తాచెదారం వీధుల్లో కనిపిస్తోంది.
ఎంపిక చేసిన గ్రామాల్లో సమావేశాలు, ర్యాలీ తూతూమంత్రంగా నిర్వహించి మమ అనిపించారు. హరిత రాయబారులు, గార్డుల జీతాలు, ఇతర అవసరాల కోసం గ్రామంలో ప్రతీ కుటుంబం నుంచి రోజుకు 2 రూపాయల చొప్పున తీసుకోవాలి. ఈ విషయంలో చాలామంది స్పందించడం లేదు. ఇక ఇంటింటా సేకరించిన చెత్తను తరలించే పరిస్థితులు లేవు. కొన్ని చోట్ల నదులు, చెరువు గర్భం, గెడ్డల వద్ద పారబోసి తగులబెడుతున్నారు. తడి, పొడి చెత్తను వేరుచేసే చర్యలు కొన్ని కేంద్రాల్లో కానరావడం లేదు.
యంత్ర పరికరాల కొరత
పారిశుద్ధ్య నిర్మూలనకు చెత్తను తరలించేందుకు ఈ-ఆటోలు కేవలం 7 పంచాయతీల్లోనే ఉన్నాయి. ప్లాస్టిక్‌ను (50మైక్రాన్ల లోపు) నివారించేందుకు ఉపయోగించే షెడ్డర్స్ 6 మండలాల్లోనే ఉన్నాయి. 2 మండలాలకు ఒకటి చొప్పున వినియోగిస్తున్నారు. వీటికి త్రీఫేజ్ విద్యుత్తు అవసరం. వైద్యపరమైన వ్యర్థాలు, మహిళలు ఉపయోగించే రుతురుమాళ్లు వంటివి కాల్చివేతకు ఇన్‌సిన్‌రేటర్స్ 17 పంచాయతీల్లోనే ఉన్నాయి. మిగిలిన పంచాయతీలకు ఇవ్వాల్సి ఉంది.
‘‘లోపాలున్న మాట వాస్తవమే. వీటిని అధిగమించేందుకు ఈవోపీఆర్డీలతో శుక్రవారమే సమావేశం నిర్వహించాం. కార్యాచరణ రూపొందించాం.’’ - డి.సత్యనారాయణ, సమన్వయాధికారి, జిల్లా వనరుల కేంద్రం
ఉన్నా లేనట్టే..
పడాలపేటకు సంబంధించి చెత్త సంపద తయారీ కేంద్రాన్ని నారాయణపురంలో ఏర్పాటు చేశారు. నిర్వహణకు ప్రత్యేకంగా బడ్జెట్ లేకపోవడంతో గాలికి వదిలేశారు. రెండుచోట్లా వానపాములను విడిచిపెట్టలేదు. ప్రజల భాగస్వామ్యం ఎక్కడా కనిపించడం లేదు.
అక్కడ అంతంతే
తడి, పొడి చెత్తను వేరు చేయడం లేదు. గుర్లలో సేకరించిన చెత్తను గుర్లగెడ్డకు సమీపంలో పారబోస్తున్నారు. ఇంటికి రూ.2ల చొప్పున వసూలు చేస్తున్నారు. చల్లపేటలో ప్రధాన రహదారికి సమీపంలోని కాలువలో మురుగు నిండిపోయింది.
ఇవీ చదవండి....
'గుట్టల్లో.. వాగుల్లో ఇళ్ల పట్టాలా..?'.. లబ్ధిదారుల ఆవేదన