విజయనగరం జిల్లా సాలూరు మండలం పరిధిలోని గిరిజనులు.. రోడ్డు సౌకర్యం కోసం శ్రమదానానికి ముందుకొచ్చారు. తమ గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎన్నోసార్లు ఫిర్యాదు చేశారు. వారు స్పందించని పరిస్థితుల్లో.. గ్రామస్తులే రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రెండు రోజుల కిందట బట్టి వలస నుంచి రూడి గ్రామం వరకు రోడ్డు నిర్మాణం ప్రారంభించారు.
రోడ్డు పనులు ప్రస్తుతం చురుగ్గా కొనసాగుతున్నాయి. బట్టి వలస, పుల్ల మామిడి, కాగూ రూడి, గాలి పాడు, రామ్ పాడు, సలపర బంధ, మర్రివలస, ఎగువ రూడి, దిగు వ రూడి గ్రామస్తులు అందరూ గిరిజనులు కలిసి చందాలు పోగు చేసుకుని రోడ్డు నిర్మిస్తున్నారు. ఇంటికి రెండు వేల రూపాయల చొప్పున నిధులు సమకూర్చుకున్నారు. శ్రమ దానం చేస్తూ అవసరమైనప్పుడు యంత్రాన్ని వినియోగిస్తున్నారు. అధికారులు స్పందించి తమకు సాయం చేయాలని కోరుతున్నారు.