ఒక్క పూట అన్నం కోసం అలమటించే వారి కోసం విజయనగరం యూత్ ఫౌండేషన్ ఓ అడుగు ముందుకేసింది. అవకాశం ఉన్న వారు ఆకలితో ఉన్న వారికి ఆహారం అందించేందుకు వీలుగా 'ఫుడ్ బ్యాంక్' ను ఏర్పాటు చేశారు. అందుకోసం విజయనగరం మయూరి కూడలి వద్ద ఒక పెద్ద ప్రత్యేక ఫ్రిజ్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చారు. ఈ ఫుడ్ బ్యాంక్‌ను శుక్రవారం ఏటికే-వెలుగు వృద్ధాశ్రమం అధ్యక్షుడు, నిత్యాన్నదాన దర్బార్ నిర్వాహకులు డాక్టర్ ఎండీ ఖలీల్ బాబు ప్రారంభించారు. సుమారు 200 మందికి మధ్యాహ్న ఆహారాన్ని ఆయన చేతుల మీదుగా అందచేశారు.
విజయనగరం యూత్ ఫౌండేషన్ యువకులు చేస్తున్న ఈ కార్యక్రమం అభినందనీయమని ఖలీల్ బాబు ప్రశంసించారు. బ్లడ్ బ్యాంక్, ట్రీ బ్యాంక్, ల్యాండ్ బ్యాంక్ మాదిరి ఫుడ్ బ్యాంకు అనేది వినూత్న కాన్సెప్ట్ అని అభివర్ణించారు. కొవిడ్ వల్ల ఎన్నో కుటుంబాలు చితికిపోయాయని, ఒక్క పూట అన్నం కోసం అలమటించే అభాగ్యులు.. ఎందరో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టే చోట దేవుడు నెలవై ఉంటాడని విశ్వాసం వ్యక్తం చేశారు. కరోనా విపత్తులో మృతులకి అంతిమ సంస్కరాలతో పాటు ఆర్థిక, వ్యయ ప్రయాసలకి ఓర్చి అంబులెన్స్ సేవలు అందించిన ఇల్తమస్, అంబులెన్స్ శివలను ప్రత్యేకంగా అభినందించారు.