విజయనగరం జిల్లా కొమరాడ మండలంలోని నాగావళి ఆవల ఉన్న కొట్టు, తొడుము, నిమ్మలపాడు, వన్నాం, పాలెం, గుణద తీలేసు, కెమిశిల, మాదలంగి, దళాయిపేట పంచాయతీల పరిధిలోని 33 గ్రామాల ప్రజలు బాహ్య ప్రపంచంలోకి రావాలంటే నదిని దాటాల్సిందే. ఇలా ఆగస్టు 30, 1996న నది దాట సేమయంలో పడవ ప్రమాదంలో 33 మంది చనిపోయారు. అప్పుడు పూర్ణపాడు-లాబేసు గ్రామాల మధ్య వంతెన కట్టాలనే ఆలోచన ఇప్పటికీ నెరవేరడం లేదు.
ఎన్నటికి మోక్షమో..?
అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2006లో వంతెన మంజూరు చేశారు. రూ.3.20 కోట్లతో నిర్మాణానికి అప్పటి మంత్రి శత్రుచర్ల విజయరామరాజు శంకుస్థాపన చేశారు. పనుల్లో జాప్యం కారణంగా అంచనాలు భారీగా పెరిగాయి. అంచనా వ్యయం రూ.9.98 కోట్లకు చేరింది. ఇందులో సుమారు రూ.7 కోట్లు ఖర్చు చేసి పనులు మధ్యలోనే ఆపేశారు. మిగిలిన మొత్తం వెనక్కి వెళ్లిపోయింది. తరువాత తిరిగి పనుల పూర్తికి రూ.4 కోట్లు అవసరమని ప్రతిపాదనలు పంపించారు. గత నెల 9న వెనక్కి వెళ్లిన నిధులతో పాటు రూ.4 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయినా పురోగతి లేదు. నిధులు మంజూరైనా విడుదల కాలేదని స్థానికులు చెబుతున్నారు.
చదువులకు దూరం..: ఇక్కడి విద్యార్థులు వంతెన లేకపోవడంతో చదువులకు దూరమవుతున్నారు. తొమ్మిది ఆపై చదవాలంటే కొమరాడ రావాలి. నదిలో రాకపోకలు ప్రమాదకరం కావడంతో చాలామంది వారి పిల్లలను తొమ్మిదో తరగతి వరకే చదివించి తర్వాత మాన్పించేస్తున్నారు. మాదలంగిలో పదో తరగతి వరకు చదువుకునే అవకాశం ఉంది. గుణద తీలేసులో సుమారు పది మంది విద్యార్థులు పదో తరగతితో ఆపేశారు. వసతిగృహాలు ఏర్పాటు చేస్తే పిల్లల్ని చదివించడానికి సిద్ధంగా ఉన్నామని తల్లిదండ్రులు చెబుతున్నారు. వర్షాకాలం వచ్చిందంటే పాఠశాలలకు వెళ్లలేకపోతున్నారు.
40 కి.మీ.లు అదనపు ప్రయాణం: గర్భిణులకు పురిటి నొప్పులు వచ్చినా.. ఎవరైనా ఏదైనా ప్రమాదానికి గురైనా.. పాము కాటు బారిన పడినా.. అనారోగ్యం పాలైనా దేవుడిపై భారం వేయాల్సిందే. అత్యవసర సమయంలో ప్రవాహ ఉద్ధృతి ఎక్కువగా లేకపోతే మంచంపై పడుకోబెట్టి నలుగురు మోసుకుంటూ నదిని దాటించాలి. లేదంటే కురుపాం మీదుగా ప్రయాణించాల్సిందే. ఇక్కడి ప్రజలు ఐటీడీఏ కేంద్రం ఉన్న పార్వతీపురం చేరుకోవాలంటే కురుపాం మీదుగా సుమారు 60 కి.మీ. ప్రయాణించాలి. వంతెన అందుబాటులోకి వస్తే 40 కి.మీ. వరకూ దూరం తగ్గుతుంది.
త్వరలోనే ప్రారంభిస్తాం..
పనుల్లో జాప్యం వాస్తవమే. గత నెలలో ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. గుత్తేదారుకు బకాయిలు చెల్లిస్తాం. నీటి ప్రవాహ ఉద్ధృతితో పనులకు ఆటంకం ఏర్పడుతోంది. నవంబరులో పనులు ప్రారంభించి త్వరలోనే వంతెన పూర్తి చేస్తాం.