ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మంచు కురిసి.. మంచానికే పరిమితమవుతున్నారు! - విజయనగరంలో చలికాలం న్యూస్

ఎటు చూసినా పచ్చదనం.. ఎత్తైన కొండలు... లోతైన లోయలు. వాటిని కమ్మేసినట్లు... పచ్చని చెట్లు. వెండి తొడిగినట్లు మబ్బులతో ముద్దాడుతున్న కొండలు. మరోవైపు మంచు తెరలు.. చల్లటి పిల్లగాలులు. శీతాకాలంలో విజయనగరం ఏజెన్సీ ప్రాంతాల్లో కనువిందు చేసే దృశ్యాలివి. ఇదంతా ఒకవైపే.. బయటి వారికి మాత్రమే అది స్వర్గం.. అక్కడే నివసించే వారికి మాత్రం అదో 'చల్లటి' నరకం.

vijayanagaram people facing health problems wiht winter season
vijayanagaram people facing health problems wiht winter season

By

Published : Dec 20, 2019, 8:03 AM IST

మంచు కురిసి.. మంచానికే పరిమితమవుతున్నారు!

ప్రకృతి సుందర దృశ్యాలు చూస్తే ఎవరికైనా ఆనందమే. ఈ సౌందర్యం నడుమ సేద తీరడానికి నగరవాసులు ఏజెన్సీ ప్రాంతాలకు పరుగులు పెడుతుంటారు. ఆ ప్రాంతాల్లో స్థానికంగా ఉంటున్న గిరిజనులు మాత్రం ఉక్కిరి బిక్కిరి అవుతుంటారు. పెరిగిన చలి తీవ్రత వారిని పలు రోగాలకు గురి చేస్తోంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితి.. గిరిజనులను ఆసుపత్రుల పాల్జేస్తోంది. తీవ్ర జ్వరాలు, శ్వాసకోశ వ్యాధులతో వారు రోజుల తరబడి ప్రభుత్వాసుపత్రి చుట్టూ తిరగాల్సి వస్తోంది. విజయనగరంజిల్లా పార్వతీపురం ఐడీటీఏ పరిధిలోని గిరిజనులకు చలికాలం చల్లటి నరకాన్ని చూపిస్తోంది.

రోజుల తరబడి ఆసుపత్రుల్లోనే..

విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో 17 గిరిజన మండలాలు ఉన్నాయి. వీటిలో సగానికి పైగా విశాఖ జిల్లా అరకు, పాడేరుకు అతి సమీపంలోనివే. గత కొద్ది రోజులుగా పెరిగిన చలి తీవ్రత గిరిజనులను తీవ్ర అనారోగ్యానికి గురిచేస్తోంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి మరుసటి ఉదయం 10 గంటల వరకూ మంచు కురుస్తున్న పరిస్థితుల్లో ఆయా ప్రాంతాల ప్రజలు రోగాల బారినపడుతున్నారు. దగ్గు, విరేచనాలు, సికిల్ సెలేమియా, తీవ్ర జ్వరాలతోపాటు శ్వాసకోశ వ్యాధులకు గురవుతున్నారు. పెరిగిన చలి తీవ్రతతోపాటు.. మారుతున్న వాతావరణ పరిస్థితులు ఇంటిల్లిపాదిని మంచాన పడేస్తున్నాయి. రోజుల తరబడి ఆసుపత్రుల చుట్టూ తిరిగేలా చేస్తున్నాయి.

పనుల్లేక ఇబ్బందులు

రెక్కాడితే గానీ... డొక్కాడని పరిస్థితుల్లో రోగాల వల్ల.. ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నారు స్థానికులు. రవాణ, మందుల ఖర్చులకు అప్పులు చేయాల్సిన పరిస్థితి. ప్రస్తుతం వరికోతల సమయం.. అయినా ఆసుపత్రుల చుట్టే తిరుగుతున్నారు వాళ్లు.

రోగులతో నిండిపోతున్న ఆసుపత్రులు

చలి ప్రభావంతో రోగాల బారిన పడుతున్న వారి కారణంగా స్థానిక ప్రభుత్వ వైద్యశాలలు కిటకిటలాడుతున్నాయి. విజయనగరంజిల్లా ఏజెన్సీ ప్రాంతాలకు ప్రధాన వైద్యశాలైన పార్వతీపురం ప్రాంతీయ ఆసుపత్రి రోగులతో నిండి పోయింది. రోజుకు 500 నుంచి 600 మంది వరకు ఇక్కడ ఓపీ నమోదవుతోంది. ఈ ఏడాది గిరిజన ప్రాంతాల్లో పరిస్థితి తీవ్రంగా ఉందని వైద్యులు సైతం చెబుతున్నారు.

భారీ వర్షాలతో మొన్నటి వరకు విష జ్వరాలు, మలేరియా, డెంగీ వంటి వ్యాధులతో సతమతమైన గిరిజనులు.. ఇప్పుడు శీతాకాల వ్యాధులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వైద్యశాఖ ప్రత్యేక దృష్టి సారించి.. ఏజెన్సీ ప్రజలు శీతాకాల వ్యాధులకు గురికాకుండా తగిన చర్యలు చేపట్టాలని గిరిజన సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.

ఇదీ చదవండి:

మంచును కప్పుకున్న విశాఖ మన్యం

ABOUT THE AUTHOR

...view details