విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించిన రహదారి పనులను జాయింట్ కలెక్టర్ కిషోర్ బాబు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో జేఏసీతో పాటు ఎయిర్పోర్ట్ కార్పొరేషన్ లిమిటెడ్, నేషనల్ హైవే, రెవిన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు. భోగాపురం మండలం ఉప్పాడ పేట జాతీయ రహదారి నుంచి టెర్మినల్ పాయింట్‌కు అనుసంధానం జరిగే రహదారి నిర్మాణంపై సమీక్ష జరిపారు. జాతీయ రహదారి నుంచి 3.1 కిలోమీటర్ల దూరంలో ఉండే టెర్మినల్‌కు వెళ్లే వాహనాల రాకపోకలకు అనుకూలంగా వంతెన నిర్మాణం జరుగుతున్న విషయంలో అధికారులు మరింత శ్రద్ధ వహించాలన్నారు.
ఇటు శ్రీకాకుళం అటు విశాఖపట్నం నుంచి విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులకు సౌకర్యార్థంగా వృత్తాకారంలో వంతెన నిర్మాణం జరగాలని కిషోర్ కుమార్ తెలియజేశారు. దీనివలన ఇరు ప్రాంతాల వారికి ఎంతో వీలుగా ఉంటుందన్నారు. నాలుగైదు రోజుల్లో వంతెన నిర్మాణానికి సంబంధించి పూర్తిస్థాయిలో మ్యాప్ డిజైన్ సిద్ధం చేస్తామని హైవే అథారిటీ డిప్యూటీ మేనేజర్ ప్రశాంత్ మిశ్రా జేఏసీకి హామీ ఇచ్చారు.