వైద్య, ఆరోగ్య శాఖల అధికారులు, వివిధ మండలాల పీహెచ్‌సీల వైద్యాధికారులతో విజయనగరం కలెక్టరేట్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) డాక్టర్ ఆర్. మహేష్ కుమార్ సమీక్ష నిర్వహించారు. కరోనా నియంత్రణలో వైద్యాధికారుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. అలసత్వాన్ని విడిచిపెట్టి, మరింత క్రీయాశీలకంగా పనిచేయాలని కోరారు. పీహెచ్సీ పరిధిలోని కరోనా కేసులు, క్షేతస్థాయి సిబ్బంది పనితీరును తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉన్న సిబ్బంది అందరి సేవలను వైద్యాధికారులు పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలని చెప్పారు.
స్టాఫ్‌నర్సులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లతో పాటు సచివాలయాల సిబ్బందినీ వినియోగించుకోవాలన్నారు. కరోనా నియంత్రణకు ప్రభుత్వం ఇచ్చిన సూచనలు, ఆదేశాలు కచ్చితంగా పాటించేలని స్పష్టం చేశారు. విధి నిర్వహణలో క్షేత్రస్థాయిలో ఏమైనా సమస్యలు ఉత్పన్నమైతే... తక్షణమే తమ దృష్టికి తేవాలని సూచించారు. పనితీరు సక్రమంగా లేని సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.