విజయనగరం జిల్లాలో కరోనా వైరస్ రోజురోజుకి తీవ్రమవుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం. హరి జవరహర్‌లాల్ తెలిపారు. ప్రజలంతా మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు. భౌతిక దూరం పాటిస్తూ... తరచూ చేతులను సబ్బుతో శుభ్రపరుచుకోవటం ద్వారా వైరస్ బారిన పడకుండా ఉండవచ్చునని సూచించారు.
ఒకవేళ కొవిడ్ సోకినా అధైర్య పడవద్దనీ.. చికిత్స అందించేందుకు అన్నివిధాలా సంసిద్ధంగా ఉన్నామని భరోసానిచ్చారు. ప్రజలందరి సహకారంతోనే 48 రోజుల పాటు జిల్లాను గ్రీన్‌జోన్‌గా ఉంచగలిగామని గుర్తు చేసుకున్నారు.
అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి ప్రజలు బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. స్వచ్ఛంద లాక్‌డౌన్‌కు అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. రోజుకు రెండువేల మందికి కరోనా పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
కరోనా పాజిటివ్ వచ్చినప్పటికీ... ఎటువంటి లక్షణాలు లేని బాధితులకు ఇంట్లోనే చికిత్స అందిస్తామని తెలిపారు. హోమ్ ఐసోలేషన్‌లో ఉన్న వారికి ప్రత్యేక వైద్య బృందాల ద్వారా చికిత్స అందిస్తామని వెల్లడించారు.