రామతీర్థం విగ్రహాల ధ్వంసం వెనుక తెలుగుదేశం నేతల కుట్ర దాగి ఉందన్నారు వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, లోకేశ్, ఆ పార్టీ నేతలే దీనంతటికీ కారణమని మండిపడ్డారు. మంచి పాలన అందిస్తున్న జగన్ ప్రభుత్వాన్ని తప్పుపట్టేలా తెలుగుదేశం నాయకులు వ్యవహరిస్తున్నారన్నారు. గతంలోనూ ఇలాంటి నిరాధార ఆరోపణలు చేశారని... అవన్నీ అబద్దమని తేలిందని వివరించారు.
రామతీర్థం దేవాలయానికి ఛైర్మన్‌గా ఉన్న అశోక్‌గజపతి రాజు... విగ్రహాల ధ్వంసానికి బాధ్యత వహించాలని వియసాయి రెడ్డి డిమాండ్ చేశారు. తెలుగుదేశంలో కుట్రలో ఆయనకూ భాగం ఉందని ఆరోపించారు. అందుకే ఆయన రాజీనామా చేయాలని అన్నారు. నెల్లిమర్ల నియోజకవర్గంలో ఇళ్ల పట్టాల పంపిణీ అడ్డుకోవాలని ఈ విగ్రహాల ధ్వంసం కుట్ర పన్నారని ఆరోపించారు. ప్రతిపక్షాల కుట్ర రాజకీయాలకు భయపడే పరిస్థితి లేదని ఆయన వెల్లడించారు.