Valentines Day Special Love Letter: ఎంతటి ధైర్యవంతుడైనా.. ప్రేమ విషయాన్ని అమ్మాయికి చెప్పేందుకు భయపడుతూనే ఉంటాడు. ఎందుకంటే.. చెప్తే ఎలాంటి సమాధానం వస్తుందోనని. ఒకవేళ నో చెప్తే తర్వాత పరిస్థితి ఏంటని. మనసులో మాట.. ఇష్టమైన అమ్మాయికి చెప్పేందుకు ఏళ్లు పడుతుంది. ఆ వెయిటింగ్లో కూడా ఎంతో థ్రిల్ ఉంటుంది. ప్రతిరోజు చెప్పాలనే ఉత్సాహం.. సమయం, సందర్బం రాక నిరుత్సాహం.. మళ్లీ తర్వాత రోజు అదే సీన్ రిపీట్.. తిరిగి చూసుకుంటే ఎన్నో నెలలు గడిచిపోతాయి.
ప్రేమికులిద్దరూ కళ్లతో రోజూ మాట్లాడుకుంటూనే ఉంటారు. అయినా తనలో ప్రేమను వ్యక్తపరిచేందుకు రాత్రి, పగలూ తేడా లేకుండా ఆలోచిస్తూనే ఉంటాడు. నిత్యం అదే ధ్యాసలో ఉంటాడు. తిండి తిప్పలు, నిద్ర మానేసి అమ్మాయికి తన ప్రేమ ఎలా వ్యక్తపరచాలో ఏకపాత్రాభినయం చేస్తూనే ఉంటాడు. అమ్మాయికి ప్రతిరోజు ఏదో విధంగా ఐ లవ్ యూ చెప్పాలనే ధైర్యం చేసినా.. చివరకు వెనకడుగు వేస్తూనే ఉంటాడు. అదంతా భయం కాదు.. తాను కాదంటే.. తన ప్రేమ ఎక్కడ ఓడిపోతుందోమోనన్న ఆందోళన. ఆ అలజడిని ప్రతి ప్రేమికుడు అనుభవించేదే. ఎలా చెప్పాలి.. ఏం చేయాలి అని రోజుల తరబడి ఫ్రెండ్స్‌తో చర్చలు జరుపుతూనే ఉంటాడు. ఈరోజు ఎలాగైనా చెప్తానని ఛాలెంజ్ చేస్తాడు. కానీ షరా మామూలే.