విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలం చిలకమ్మగారి కాలనీలో గుర్తు తెలియని వ్యక్తులు విద్యుత్ తీగలను కోసేశారు. ఈ కారణంగా మోటరుకు విద్యుత్ సరఫరా ఆగిపోయి.. అక్కడి ప్రజలకు నీటి సరఫరా నిలిచిపోయింది. ముత్యాలమ్మపాలెం గ్రామ సమీపంలోని ఆ కాలనీలోని 25 కుటుంబాలకు తాగునీరు అందలేదు. సాయంత్రం పొలం పనుల నుంచి తిరిగొచ్చిన కాలనీ వాసులు ఈ విషయాన్ని గుర్తించారు. మోటారు పనిచేయని కారణంగా ఆ ప్రాంత ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. పశువులకు నీరు లేక నానా అవస్థలు ఎదుర్కొన్నారు. ఈ దురాగతానికి గ్రామ వైకాపా నాయకులే కారణమని స్థానికులు ఆరోపించారు.
గురువారం ఉదయం ప్రచారం కోసం వచ్చిన వైకాపా నేతలు తమ అభ్యర్ధికి ఓటు వేయాలని అభ్యర్థించారని వారు అన్నారు. తామంతా మొదటి నుంచి తెదేపా మద్దతుదారులమేనని స్థానికులు వారికి తెలిపామని చెప్పారు. ఆ కారణంగానే తమ కాలనీ వద్దనున్న తాగునీటి మోటారుకు విద్యుత్ సరఫరా తీసివేశారని స్థానికులు మండిపడ్డారు. ఈ విషయాన్ని శృంగవరపుకోట మాజీ ఎమ్మెల్యే కోల్ల లలితకుమారి దృష్టికి తీసుకెళ్లగా.. ఆమె వెంటనే గ్రామావాసులతో మాట్లాడి వివాదాన్ని పరిష్కరించారు. మోటారుకు విద్యుత్తు సరఫరా పునరుద్ధరించడంతో గొడవ సద్దుమణిగింది.