విజయనగరం జిల్లా పార్వతీపురంలో జలుబు, దగ్గుతో బాధ పడుతున్న ఇద్దరు యువకులు.. తమకు కరోనా పరీక్షలు చేయాలంటూ స్థానిక ప్రాంతీయ ఆస్పత్రిలో చేరారు. వారిని పరీక్షించిన వైద్యులు అవి సాధారణ జలుబు, దగ్గుగా గుర్తించి ఇంటికి పంపించారు. వైద్యులు తెలిపిన ప్రకారం.. మక్కువ మండలానికి చెందిన యువకుడు విశాఖలోని ఓ సంస్థలో పని చేస్తున్నాడు. కొన్నాళ్లపాటు విదేశీయులతో కలిసి పనిచేసి ఇటీవల స్వగ్రామం వచ్చాడు. జలుబు, తలనొప్పిగా ఉన్న కారణంగా.. అనుమానంతో ఆసుపత్రిలో చేరాడు. అనంతరం వైద్యులు అనుమానితుడిని ఐసోలేషన్ గదిలో ఉంచి పరీక్షలు చేశారు. పార్వతిపురానికి చెందిన మరో యువకుడు 15 రోజుల క్రితం దుబాయ్ నుంచి స్వగ్రామం చేరుకున్నాడు. జలుబు, తలనొప్పి సమస్యతో.. కరోనా సోకిందేమో అని అనుమానపడ్డాడు. ప్రాంతీయ ఆసుపత్రికి వెళ్లి పరీక్ష చేయించుకున్నాడు. ఇద్దరు యువకులను పరీక్షించిన వైద్యులు వారిలో ఎటువంటి కరోనా లక్షణాలు లేవని అవి సాధారణ జలుబు, దగ్గుగా నిర్ధారణ అయిందని తెలిపారు. యువకులకు ఇంటిలోనే ఉండాలని.... బయట తిరగవద్దని సూచించారు. ఆ ఇద్దరూ నివసించే ప్రాంత పరిధిలోని ఆశ వర్కర్లను అప్రమత్తం చేశారు. ఎవరికైనా జ్వరం అనిపిస్తే తక్షణమే ఆసుపత్రికి తీసుకురావాలని చెప్పారు.
ఇద్దరికి కరోనా అనుమానం.. నివృత్తి చేసిన వైద్య బృందం
జలుబు, దగ్గుతో బాధపడుతూ కరోనా సోకిందేమో అన్న అనుమానంతో విజయనగరం జిల్లా పార్వతీపురంలో ఇద్దరు యువకులు ఆసుపత్రిలో చేరారు. వైద్యుల పర్యవేక్షణలో అటువంటి లక్షణాలు ఏవీ లేవని తేల్చుకుని తమ అనుమానాన్ని నివృత్తి చేసుకొని ఇంటికి తిరిగి వెళ్లారు.
కరోనా అనుమానంతో ఆసుపత్రిలో చేరిన ఇద్దరు యువకులు