ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ - సుకుమా సరిహద్దు గ్రామమైన జోనాగుడా వద్ద జరిగిన ఎదురుకాల్పుల్లో.. 23 జవాన్లు ప్రాణాలు కోల్పోగా... 31మంది జవాన్లకు గాయాలయ్యాయి. చనిపోయిన జవాన్లలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు ఉన్నారు. విజయనగరం జిల్లాకు చెందిన జగదీశ్, గుంటూరు జిల్లాకు చెందిన మురళీకృష్ణ.. ఈ ఘటనలో అమరులైనట్టు అధికారులు వెల్లడించారు.
చికిత్స నిమిత్తం బీజాపూర్ తరలింపు..
ఈ ఘటనలో... డీఆర్జీకి చెందిన ఎనిమిది మంది, ఎస్టీఎఫ్కు చెందిన ఆరుగురు, కోబ్రా బెటాలియన్‌కు చెందిన ఏడుగురు, బస్తర్ బెటాలియన్‌కు చెందిన మరొక జవాను మృత్యువాత పడ్డారు. ఎదురుకాల్పుల్లో 13 మందికి తీవ్ర గాయాలవ్వగా... 18 మంది జవాన్లకు స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వీరిని బీజాపూర్‌లోని ఆస్పత్రికి తరలించారు.
చరిత్రలోనే అతిపెద్ద దాడి..
ఛత్తీస్‌గఢ్ బీజాపూర్‌లోని అడవుల్లో... చరిత్రలోనే భద్రతాదళాలపై అతిపెద్ద దాడిగా అభివర్ణిస్తున్న ఎదురుకాల్పుల ఘటనలో దాదాపు 400 మంది మావోయిస్టులు పాల్గొన్నట్లు అధికారులు వెల్లడించారు.
చర్చిస్తున్నట్లు అందిన సమాచారం..
బీజాపుర్-సుకుమా జిల్లాల సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలోని జాగర్‌గుండా, జొంగాగూడ, తారెం ప్రాంతంలో వ్యూహత్మక ప్రతిదాడిపై మావోయిస్టులు చర్చలు జరుపుతున్నట్లు భద్రతా దళాలకు సమాచారం అందింది. ఫలితంగా భద్రతాదళాలు ఆపరేషన్ చేపట్టాయి. సీఆర్పీఎఫ్కు చెందిన ప్రత్యేక అటవీ విభాగం 'కోబ్రా' సహా బస్తరీయా బెటాలియన్, ఛత్తీస్గడ్ పోలీసులకు చెందిన డీఆర్జీ బృందాలు పాల్గొన్నాయి. మొత్తంగా 6 క్యాంపులకు చెందిన 15 వందల మంది జవాన్లు.. ఆపరేషన్ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. వీరిలో 790 మంది ఆపరేషన్ కోసం అడవుల్లోకి వెళ్లగా మిగతా వారు వారికి సాయం అందించేలా ప్రణాళిక సిద్ధం చేశారు.
రెచ్చిపోయిన నక్సల్స్..
ఘటనా స్థలం వ్యూహాత్మకంగా మావోయిస్టులకు పట్టున్న ప్రాంతం. కఠిన భూభాగంతో పాటు తక్కువ సంఖ్యలో భద్రతా బలగాల కదలికలు ఉండే గ్రామం అది. జవాన్లు సరిగ్గా అక్కడకు చేరుకోగానే దాదాపు 400 మంది నక్సల్స్ మూడు వైపుల నుంచి చుట్టుముట్టారు. జవాన్లపై లైట్ మెషిన్ గన్లతో బుల్లెట్ల వర్షం కురిపించారు. వీటితో పాటు తక్కువ ప్రభావం చూపే ఐఈడీ బాంబులను విసిరారు. ఈ ఎదురుకాల్పుల్లో 23 మంది అమరులయ్యారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు.