ఇంటిలో మంటలు చెలరేగిన ఘటనలో తీవ్రంగా గాయపడి ఒకరు, చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. పార్వతీపురంలోని దేవీనగర్ లో అర్ధరాత్రి కలివరపు నారాయణమూర్తి ఇంట్లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో వృద్ధురాలు సజీవ దహనం కాగా.... ఇంటి పెద్ద విశాఖలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
అసలేం జరిగిందంటే…
విజయనగరం జిల్లా పార్వతీపురం దేవీనగర్ కాలనీలో నారాయణ మూర్తి ఇంటిలో మంటలు చెలరేగాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ప్రమాదం జరిగి ఉంటుందని కుటుంబీకులు చెబుతుండగా... కొవ్వొత్తి పక్కనే ఉన్న నిత్యావసర సరకుల పొట్లాలకు నిప్పు అంటుకొని ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో వృద్ధురాలు సుబ్బలక్ష్మి సజీవదహనం కాగా.. కుటుంబీకుల నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులకు ప్రాంతీయ ఆస్పత్రిలో చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం విశాఖ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇంటి యజమాని నారాయణ మూర్తి కన్నుమూశారని ఎస్సై కళాధర్ తెలిపారు. కొద్ది గంటల వ్యవధిలోనే తల్లీ కొడుకు మృతి చెందడంతో కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది.
ఇదీ చదవండి
వివాహేతర సంబంధం అనుమానమే విద్యార్థి హత్యకు కారణమా...?