Two People Died Due to Electric Shock in Vizianagaram : సరదాగా ఆడుకుంటుండగా విద్యుదాఘాతానికి గురై బాలుడు మృతి చెందాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతను ఆసుపత్రి పాలయ్యాడు. ఈ విషాద ఘటన గరివిడి మండలం శివరాంలో చోటు చేసుకుంది. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రాము, లక్ష్మీ అనే దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో పెద్ద కుమారుడు దుర్గా ప్రసాద్ ఐటీఐ చదువుతున్నాడు. చిన్న కుమారుడు పి.లోకేశ్(13) స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు.
ఎల్‌టీ తీగలు తగిలి బాలుడు మృతి :లోకేశ్ మంగళవారం సాయంత్రం పాఠశాలలో చదువుకొని ఇంటికి వచ్చారు. అనంతరం తోటి పిల్లలతో సరదాగా కాసేపు ఆడుకోవడానికి కోసం బయటకు వెళ్లాడు. ఈ క్రమంలో స్థానికంగా ఉన్న కల్యాణ మండపం బయట ఖాళీగా ఉన్న సీరియల్ లైటింగ్ సెట్ తీగలతో ఆడుకుంటున్నాడు. అనంతరం వాటిని చేతితో పట్టుకుని పైకి విసిరాడు. అవి ఎల్‌టీ తీగలకు తగలడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే బాలుడు మృతి చెందారు. ఆ సమయంలో అదే మార్గంలో వెళ్తున్న రెడ్డి పాపి నాయుడు అనే వ్యక్తికి వైర్లు తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు.
స్థానికుల అప్రమత్తమై అతనికి చీపురుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం ప్రధాన ఆసుపత్రికి తరలించారు. బాలుడు మృతి చెందడంతో శివరాంలో విషాదఛాయలు అలుముకున్నాయి. లోకేశ్ తల్లిదండ్రులు రాము, లక్ష్మి కన్నీరుమున్నీరుగా బోరుమంటున్నారు. ఈ దుర్ఘటనపై గరివిడి పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.
విద్యుత్ షాక్‌కు గురై కార్మికుడు మృతి : విధి నిర్వహణలో విద్యుత్ షాక్‌కు గురై ఓ కార్మికుడు మృతి చెందాడు. ఈ ఘటన చీపురుపల్లి మండలంలో మంగళవారం చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కొండములగాం గ్రామానికి చెందిన బొంతు పైడితల్లి (45) ఈపీడీసీఎల్ పరిధిలోని నాగంపేటలో వ్యవసాయ విద్యుత్తు నిర్వహణ పనులు చేసేందుకు వెళ్లారు.
11కేవీ లైన్‌కు విద్యుత్ సరఫరా ఆపాలని సంబంధిత లైన్‌మ్యాన్‌ను కోరారు. నిలిపివేసినట్లు చెప్పడంతో స్తంభం ఎక్కిన పైడితల్లి విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. అక్కడే తోటి కార్మికులు స్పందించి.. చీపురుపల్లి సామాజిక ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పైడితల్లి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ సంఘటనపై చీపురుపల్లి ట్రాన్స్‌కో ఏఈ సూర్య ప్రభాకర్ మాట్లాడుతూ పూర్తి స్థాయిలో విచారణ జరిపి, తగిన చర్యలు తీసుకుంటామన్నారు.