విజయనగరం జిల్లా గజపతినగరం మండలం ఎం.వెంకటాపురంలో విషాదం నెలకొంది. స్థానిక చంపావతి నది గుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. గ్రామానికి చెందిన సబ్బి శివ, మంగ దంపతుల కుమార్తె భవిష్య(4). పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన మంగ అక్క రాము కుమార్తె హారిక(11)తో కలసి ఇటీవల ఇక్కడికి వచ్చారు. బాలికలు సోమవారం ఉదయం 11 గంటల సమయంలో ఆడుకునేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లారు. వెంకటేశ్వర ఆలయం పక్కనుంచి చంపావతి నదిలో రాళ్ల వద్దకు చేరుకున్నారు. మధ్యాహ్నం భోజనానికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చిన్నారులను వెతికారు. ఇంతలో నదిలో బాలికలు మునిగిపోయారంటూ స్థానికులు చెప్పడంతో వెంటనే కుటుంబ సభ్యులు వారిని బయటకు తీసి గజపతినగరం ఆసుపత్రికి తరలించారు. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మంగ ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ గంగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారుల మృతితో ఆ కుటుంబంలో శోక సముద్రంలో మునిగిపోయింది.
20 రోజుల వ్యవధిలో భర్త, కుమార్తె...
రాము భర్త పైడిరాజు 20 రోజుల కిందట తణుకులో మృతి చెందారు. దీంతో మంగ తన అక్క రామును తమ ఇంట్లో అడుగు పెట్టించేందుకు నాలుగు రోజుల కిందట తీసుకొచ్చింది. ఇప్పటికే భర్త దూరమయ్యాడని రోదిస్తున్న ఆమెకు ఇప్పుడు కుమార్తె మృతి మరింత వేదనకు గురిచేస్తోంది.