విజయనగరం జిల్లా సాలూరు మండలం కొదమ పంచాయతీ అటవీ ప్రాంతం. ఇక్కడ ఉన్న చింతామాల, లద్ద అనే 2 గ్రామాల్లో సుమారు 150 కుటుంబాలు నివసిస్తున్నాయి. వీరు ఒడిశా సరిహద్దుకు 4 కిలోమీటర్ల దూరంలోని భారీ అనే గ్రామానికి సంతకు వెళ్తుంటారు. అయితే వీరు ప్రయాణం చేసేందుకు సరైన రహదారి మార్గంలేదు. వీరి పరిస్థితిపై కథనాలు వచ్చినప్పటికీ రోడ్డు పడలేదు.
ఇక లాభం లేదనుకుని గిరిపుత్రులే రోడ్డు వేసుకునేందుకు ముందుకు వచ్చారు. సంతకు వెళ్లే 4 కిలోమీటర్ల వరకైనా రోడ్డు నిర్మించాలని సంకల్పించారు. ఇంటికి రూ. 2వేలు చొప్పున చందాలు వేసుకున్నారు. మరికొంత సొమ్ము అప్పు తీసుకొచ్చారు. కొండను తొలిచి పనులు మొదలుపెట్టారు. అలా కష్టపడి ఘాట్ రోడ్డును నిర్మించుకున్నారు. మరో వారం రోజులు పనిచేస్తే పూర్తిస్థాయిలో రోడ్డు అందుబాటులోకి వస్తుందని గిరిజనులు చెప్పారు.