No Compensation to Tribal University Residents: రాష్ట్రంలో గిరిజన విశ్వవిద్యాలయ నిర్మాణానికి పునాది రాయి పడబోతోంది. ఉమ్మడి విజయనగరంజిల్లా పరిధి మెంటాడ, దత్తిరాజేరు మండలాల సరిహద్దులో నిర్మించనున్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి.. ఈ నెల 25న సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేతుల మీదుగా భూమి పూజ జరగనుంది. అయితే పరిహారం విషయంలో తమకు న్యాయం జరగలేదని.. పలువురు నిర్వాసితులు వాపోతున్నారు.
రాష్ట్ర విభజన అనంతరం కేంద్రం ప్రకటించిన సంస్థల్లో గిరిజన విశ్వవిద్యాలయం ఒక్కటి. ఈ వర్శిటీని విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేస్తున్నట్లు అప్పట్లో ప్రకటించారు. ఈ మేరకు జిల్లాలో కొత్తవలస మండలం రెల్లి రెవిన్యూ గ్రామ పరిధిలోని అప్పన్నదొరపాలెం వద్ద విశ్వవిద్యాలయం ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. దీని కోసం 500ఎకరాల భూమిని సైతం అధికారులు 2016లో సేకరించారు. అయితే., రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం రావటంతో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుపై కొత్త ప్రదిపాదన తెరపైకి వచ్చింది.
వచ్చే నెలలో గిరిజన విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన!
ఉమ్మడి విజయనగరంజిల్లా పరిధి మెంటాడ, దత్తిరాజేరు మండలాల సరిహద్దులో గిరిజన విశ్వవిద్యాలయానికి 561.91 ఎకరాల భూసేకరణ చేశారు. కేటాయించిన భూమిని జిల్లా యంత్రాంగం విశ్వవిద్యాలయానికి అప్పగించటంతో., నూతన భవనాల నిర్మాణ పనులకు ఈ నెల 25న శంకుస్థాపన జరగనుంది. సీఎం జగన్, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ల చేతుల మీదుగా భూమి పూజ జరుగునుంది. ఏర్పాట్లను కలెక్టర్ నాగలక్ష్మి పరిశీలించారు.
వర్సిటీ ఏర్పాటుకు సేకరించిన 561.91 ఎకరాల భూమిలో 262.52 ఎకరాలు ప్రభుత్వ భూమి కాగా. 90.60 ఎకరాల జిరాయితీ, 208.72 ఎకరాల డి-పట్టా భూములున్నాయి. జీరాయితీకి 12 లక్షలు, డి-పట్టాకు 9లక్షల రూపాయల పరిహారం చెల్లించారు. మెంటాడ మండలం కుంటినవలసకు చెందిన వారికి ఈ ప్రాంతంలోనే డి-పట్టా భూములున్నాయి. వీరికి సంబంధించిన డి-పట్టా భూములను అధికారులు, గిరిజన విశ్వవిద్యాలయం కోసం సేకరించి.. వారి వద్ద ఉన్న పట్టాదారు పాసుపుస్తకాలను తీసుకున్నారు. కానీ, పలువురు రైతులకు నిర్ణయం మేరకు నేటికీ పరిహారం అందలేదు. మరో 1.37 కోట్లు మాత్రమే రైతులకు పరిహారం చెల్లించాల్సి ఉందని.. అది కూడా త్వరలో చెల్లిస్తామని కలెక్టర్ చెబుతున్నారు.