ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వ్యాధి వచ్చిన వారంలో ప్రాణం పోతోంది.. కాపాడండి సారూ' - itda po visits tribal area news

విజయనగరం జిల్లా చిల్లమామిడిలో గిరిజనులు వింత వ్యాధితో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ విషయంపై ఆరా తీసేందుకు ఐటీడీఏ పీవో కూర్మనాథ్ ఆ ప్రాంతంలో పర్యటించారు. అక్కడి పరిస్థితులను గమనించారు. నమూనాలు సేకరించి కారణాలు తెలుసుకోవాలని వైద్యాధికారులను ఆదేశించారు.

ITDA PO
బాధిత కుటుంబాలతో మాట్లాడుతున్న పీవో కూర్మనాథ్‌..

By

Published : Nov 21, 2020, 11:32 AM IST

‘గిరిజన గ్రామాల్లో అందరం మడ్డికల్లు తాగుతాం. మాంసం తింటాం. చెట్టు, పుట్ట, రాయి, రప్పకి పూజిస్తాం. అందరిలాగే మేమూ చేస్తున్నాం.. అయినా మాకే ఎందుకిలా జరుగుతోంది సారూ.. కాళ్లు, ఒళ్లు వాపులొస్తున్నాయి.. ఊపిరాడక వారంలోనే ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నా’యంటూ ఐటీడీఏ పీవో కూర్మనాథ్‌ ముందు చిల్లమామిడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఆ గ్రామంలో వింత వ్యాధితో పలువురు మరణించడంతో పీవో ఆ గ్రామాన్ని శుక్రవారం సందర్శించారు. గ్రామంలోని పలు అంశాలు పీవోను ఆశ్చర్యానికి గురిచేశాయి. ప్రతీ ఇంటా మడ్డి కల్లు నిల్వలు, రోగాల బారిన పడిన పిల్లలు, వృద్ధులను చూసి ఆయన చలించిపోయారు.

నమూనాల సేకరణ..

ఒళ్లు వాపులు, పొంగులు, పచ్చకామెర్లు వచ్చి వారంలోనే మరణించడానికి కారణాలు తెలుసుకునేందుకు గ్రామస్థులు వినియోగిస్తున్న మడ్డికల్లు, సారా, తయారీ పదార్థాలు, బావి నీటి నమూనాలను పీవో సేకరించారు. వ్యాధి లక్షణాలున్న వారి రక్త నమూనాలను వైద్యాధికారిణి హేమలత తీసుకున్నారు. గ్రామస్థులను విడతల వారీగా కేజీహెచ్‌కు తరలించే ఏర్పాట్లను చేయాలని తహసీల్దార్‌ రమణమూర్తికి సూచించారు. అంగన్‌వాడీల ద్వారా పోషకాహారం అందించేలా చూడాలని ఎంపీడీవో రామారావును ఆదేశించారు.

నమ్మకముంటే ప్రయోగించండి..

తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులు జ్యోతి, అఖిల్‌

గ్రామంలో పర్యటించిన పీవో ప్రజలతో సమావేశమయ్యారు. ఆరోగ్య పరిస్థితి, సమస్యల గురించి తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాలు, విద్య, వైద్య సేవలు, పోషకాహారంపై ఆరా తీశారు. చిల్లంగి, చేతబడిలాంటి మూఢ విశ్వాసాలను నమ్మొద్దని సూచించారు. వాటిపై నమ్మకం ఉంటే తనపై ప్రయోగించాలన్నారు. మడ్డికల్లు, సారాకు దూరంగా ఉండాలని సూచించారు. దురలవాట్లను విడిచి పెట్టాలని ప్రతిజ్ఞ చేయించారు. గ్రామంలో మళ్లీ మరణాలు సంభవించకుండా చర్యలు చేపడతామని పీవో కూర్మనాథ్‌ తెలిపారు.

విధికి తలొంచారు..

కుటుంబ సభ్యులంతా చనిపోవడంతో చిన్నారికి దిక్కైన అమ్మమ్మ సీతమ్మ

గ్రామంలో వింత వ్యాధితో కొందరు మరణించగా ఆయా కుటుంబ సభ్యులు అనాథలయ్యారు. వేర్వేరు కుటుంబాలకు చెందిన భార్యాభర్తలు, తల్లీకుమార్తె, తండ్రీకుమారులు ఇలా చాలామంది మృత్యువాత పడ్డారు. గతనెలలో ముఖి పెద్దమ్మ, అమ్మన్న మృతి చెందగా వారి కుమార్తె జ్యోతి, కుమారుడు అఖిల్‌ అనాథలయ్యారు. ఏడు, రెండేళ్ల ప్రాయంలో తల్లిదండ్రులను కోల్పోయిన ఆ చిన్నారులకు అన్న ఆసరాగా నిలిచాడు. ముఖి సీతమ్మ భర్త అప్పారావు, కొడుకు రమేష్‌, కుమార్తె గంగ ఎనిమిది నెలల క్రితం మరణించారు. కుమార్తె బిడ్డకు అమ్మమ్మ సీతమ్మ పెద్దదిక్కయింది.

ఇదీ చదవండి:

మహిళల రక్షణ కోసం 'అభయం'.. వెయ్యి ఆటోల ట్రాకింగ్ నిరంతరం

ABOUT THE AUTHOR

...view details