ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ముంజేరులో ఉద్రిక్తత.. మిరాకిల్​పై భూఆక్రమణ ఆరోపణలు.. స్వాధీనానికి అధికారుల యత్నం

Munjeru Miracle Software Institution : విజయనగరం జిల్లాలోని ముంజేరులోని మిరాకిల్ అనే సాఫ్ట్​వేర్​ సంస్థ వద్ద ఉద్రిక్తత తలెత్తింది. ఈ సంస్థ ప్రభుత్వ భూములను ఆక్రమించిందని రెవెన్యూ అధికారులు స్వాధీనానికి సిద్ధం కాగా.. సంస్థ ఉద్యోగులు, గ్రామస్థులు, ఇంజనీరింగ్​ కళాశాల విద్యార్థులు అడ్డుకున్నారు.

Etv Bharat
Etv Bharat

By

Published : Mar 7, 2023, 4:36 PM IST

విజయనగరం జిల్లా ముంజేరులోని సాప్ట్​వేర్​ సంస్థ వద్ద ఉద్రిక్తత

Munjeru Miracle Software Institution : విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముంజేరులోని మిరాకిల్ సాప్ట్​వేర్ కంపెనీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మిరాకిల్ సంస్థ ప్రభుత్వ భూములు ఆక్రమించిందని ఆరోపణలపై ఆక్రమణలను స్వాధీనం చేసుకునేందుకు రెవెన్యూ అధికారులు పోలీసులతో కలిసి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో మిరాకిల్ సంస్థ ప్రధాన ద్వారం వద్దకు అధికారులు, పోలీసులు చేరుకోగానే.. ఉద్యోగులు, ఇంజనీరింగ్​ కళాశాల విద్యార్థులు భారీగా మోహరించి, అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులకు ఉద్యోగులు, విద్యార్థుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో దాడులు నిర్వహించగా స్థానిక ఎమ్మెల్యేను, ఎంపీని, కలెక్టర్​ను కలిసి తమ సమస్యను వివరించారు. అయినప్పటికి మళ్లీ దాడులు జరగటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కంపెనీ ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజలు అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వీరి అడ్డగింతతో అధికారులు, పోలీసులు అక్కడి నుంచి వెనుదిరిగారు.

"హైకోర్టులో మేము పిటిషన్​ వేసి ఏడు సంవత్సరాలు అయ్యింది. అప్పుడు కోర్టు 15 రోజులు స్టే ఆర్డర్​ ఇచ్చింది. ఇప్పుడు స్టే ఆర్డర్​ ఉన్నట్లా.. లేనట్ల. ఇదే విషయం మేము ఆర్డీవో, కలెక్టర్​కు తెలియజేశాము. కానీ, ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న ప్రజలపై దాడులు చేస్తున్నారు. ఇది కచ్చితంగా దారుణం, కక్షపూరిత చర్య." -లోకం ప్రసాద్, మిరాకిల్ సాప్ట్ వేర్ కంపెనీ ఎండీ

స్పందించిన ఆర్డీవో :ముంజేరులోని ఆక్రమణల తొలగింపు ఆరోపణలపై ఆర్డీవో సూర్యకళ స్పందించారు. కంపెనీ చేపట్టిన అక్రమిత కట్టాడాలను తొలగిస్తున్నామని ఆమె తెలిపారు. మిరాకిల్ సాఫ్ట్‌వేర్‌ సంస్థ 14 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమించిందని ఆమె వెల్లడించారు. ఆ కంపెనీ వాగులపై, కల్వర్టులపై నిర్మించిన రోడ్లను తొలగిస్తున్నామని వివరించారు.

గతంలో ఇదే తరహలో :ప్రభుత్వ భూములన్నాయని అధికారులు నిత్యం దాడులు చేస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ముంజేరులోని మిరాకిల్ సాఫ్ట్​వేర్​ సంస్థ ఉద్యోగులు, ప్రజలు ఆరోపిస్తున్నారు. మిరాకిల్ సాఫ్ట్​వేర్​ సంస్థ ప్రభుత్వ భూములను అక్రమించిందని గత నెలలో ఇదేవిధంగా రెవెన్యూ అధికారులు దాడులు నిర్వహించారు. ఆ సమయంలో అక్రమణ ఆరోపణ ఉన్న భూముల చుట్టూ సిమెంటు స్తంభాలను ఏర్పాటు చేసేందుకు రెవెన్యూ అధికారులు సిద్ధమయ్యారు. దీంతో సంస్థ ఉద్యోగులు, ముంజేరు గ్రామస్థులు స్తంభాల ఏర్పాటును వ్యతిరేకించటంతో వెనుదిరిగారు. ఈ దాడులు పునరావృతం కాకుండా చూడాలని.. మిరాకిల్ సంస్థ ప్రతినిధులు, ఉద్యోగులు, ముంజేరు గ్రామస్థులు కలెక్టర్​ సూర్యకుమారిని సంప్రదించారు.

విజయనగరం జిల్లాలోని మారుమూల ప్రాంతంలో సాఫ్ట్​​వేర్​ సంస్థను ఏర్పాటు చేసి.. సుమారు 1500 వందల మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించమని సంస్థ ప్రతినిది లోకం ప్రసాద్​ తెలిపారు. ఉపాధి మాత్రమే కాకుండా గత 25 సంవత్సరాల క్రితం ఇంజనీరింగ్​ కళాశాలను స్థాపించి.. ఇక్కడి విద్యార్థులకు విద్యను అందిస్తున్నట్లు వివరించారు. వారి సంస్థ ప్రభుత్వ భూములు అక్రమించిందంటూ నిత్యం ప్రభుత్వం భయభ్రాంతులకు గురిచేస్తోందని వాపోయారు. 2009 సంస్థను స్థాపించగా.. కంపెనీకి 14 ఎకరాల భూమి సంస్థ వినియోగించుకునేందుకు అనుమతులు పొందామని తెలిపారు. ఆ 14 ఎకరాల భూమిలో వాగులు, వంకలు ఉన్నందున వాటిని సంస్థకు అప్పగించలేదని తెలిపారు. కానీ, వాటి సంరక్షణ మాత్రం వారికే అప్పగించినట్లు వివరించారు. అంతేకాకుండా.. కంపెనీ పరిరక్షణలోని ప్రభుత్వ భూముల విషయంపై 2016లో హైకోర్టు స్టే విధించిందన్నారు. ప్రస్తుతం అధికారులు ఎలాంటి ముందస్తు నోటిసులు అందించకుండా ఇలా దాడులకు దిగటం దారుణమని అన్నారు. కనీసం షోకాజు నోటీసులు కూడా అందించకుండా అధికారులు నిత్యం భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

రాజకీయ కక్షలే కారణమంటున్న సంస్థ ప్రతినిధులు :ప్రభుత్వం రాజకీయ కక్షతోనే మా కంపెనీని ఇక్కడి నుంచి తరిమేయాలని చూస్తోందని ఆరోపించారు. సంస్థ అక్కడి నుంచి తరలిపోతే.. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేల మంది ఉపాధిని కోల్పోతారని అన్నారు. దాదాపు సమీప ప్రాంతంలోని ప్రజలకే సంస్థలో ఉద్యోగాలు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వానికి పరిశ్రమలను తరిమికొట్టడం అలవాటుగా మారిందని విమర్శించారు. పక్క రాష్ట్రాలలో ఇలాంటి వివాదాలు వస్తే ముందు.. పూర్తిస్థాయి విచారణ చేపట్టిన తర్వాతనే చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. కానీ, రాష్ట్రంలో అందుకు విరుద్ధంగా ముందే దాడులు చేస్తున్నారని వాపోయారు.

ఇదీ జరిగింది :

ABOUT THE AUTHOR

...view details