మాన్యువల్ కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు చేపట్టాలని రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ సంఘాలు డీఈవో కార్యాలయాలను ముట్టడించాయి. ఫ్యాప్టో పిలుపు మేరకు నిర్వహించిన కార్యక్రమం.. విజయనగరంలో ఆందోళనకరంగా మారింది. విద్యాశాఖ జిల్లా కార్యాలయం ముట్టడికి బయలుదేరిన ఉపాధ్యాయులను పోలీసులు అడ్డుకున్నారు. ఆగ్రహించిన వారు.. నిరసనగా కలెక్టరేట్ ముందు బైఠాయించి, సిబ్బందిని అడ్డుకున్నారు. రెండు గంటల పాటు జిల్లా పాలనాధికారి కార్యాలయం ప్రధాన ద్వారం వద్ద ఆందోళన నిర్వహించారు.
తమ న్యాయమైన సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. గతంలో ఇచ్చిన హామీల మేరకు.. బదిలీలను వెబ్ విధానంలో కాకుండా సాధారణ పద్ధతిలోనే నిర్వహించాలన్నారు. అన్ని ఖాళీలను బహిర్గతం చేయాలని విజ్ఞప్తి చేశారు. న్యాయమైన, ఆర్థిక పరమైన అంశాలతో సంబంధం లేని తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. లేకపోతే..ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తామన్నారు. బదిలీల ప్రక్రియను సైతం బహిష్కరిస్తామని హెచ్చరించారు.