Bobbili Teacher Murder Case: విజయనగరం జిల్లాలో కృష్ణ మాస్టర్.. ఈ పేరు వింటే బొబ్బిలి నియోజకవర్గంలో తెలియని వారుండరు. చిన్న పల్లెటూళ్లో పుట్టి ప్రజల మధ్య పెరిగారు. వారి బాగోగులు చూసుకున్నారు. జనం మెచ్చిన నేతగా ఎదిగారు. రెండున్నర దశాబ్దాల పాటు గ్రామాభివృద్ధిలో పాల్పంచుకున్నారు. ఊరి గురించి ఆలోచిస్తూనే.. పిల్లల ఉన్నతికి కృషి చేస్తున్నారు. రాజకీయంగా తమకు అడ్డువస్తున్నారని ఆయనను ప్రత్యర్థులు కిరాతకంగా హతమార్చారు. కృష్ణ మాస్టర్ హత్యతో ఉద్దవోలు ఉలిక్కిపడింది. మాస్టర్ ఇక లేరని తెలిసిన ప్రజలు కన్నీటిపర్యంతమయ్యారు.
శనివారం ప్రత్యర్థుల చేతిలో దారుణ హత్యకు గురైన ఏగిరెడ్డి కృష్ణకు ఆదివారం అశేష ప్రజానీకం కన్నీటితో వీడ్కోలు పలికింది. వేల మంది విద్యార్థులు, మహిళలు, రైతులు, అభిమానులు, సమీప గ్రామాల నుంచి ప్రజలు, స్నేహితులు, అన్ని పార్టీల నాయకులు తరలివచ్చి ఆయన స్వగృహం నుంచి శ్మశానవాటిక వరకూ భారీగా అంతిమయాత్ర నిర్వహించారు. ఎప్పటికీ మీరే మా స్టారంటూ.. ఆయనకు కన్నీటితో వీడ్కోలు పలికారు. మాస్టారు భార్య జోగేశ్వరమ్మ, కుమార్తె ఝాన్సీ, కుమారుడు శ్రావణ్లను ఓదార్చడం గ్రామస్థుల తరం కాలేకపోయింది.
పెల్లుబికిన ఆగ్రహం..
జిల్లాలో ఒక్కసారిగా రాజకీయ కక్షలు బుసలు కొట్టాయి. ఉపాధ్యాయుడు కృష్ణ హత్యతో బాధిత కుటుంబసభ్యులు, గ్రామస్థుల ఆందోళనలతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసు బలగాలను మోహరించారు. నిందితుడు వెంకటనాయుడి చిన్నాన్న అప్పలనాయుడు తీవ్ర పదజాలంతో వ్యాఖ్యలు చేశారని తెలిసి.. గ్రామానికి చెందిన మహిళలు, యువకులు, కృష్ణ మద్దతుదారులు ఆదివారం భారీగా ఆయన ఇంటి ముందు ఆందోళన చేశారు.
ఇంటిపైకి రాళ్లు విసిరారు. సమీపంలో ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. వాళ్లను అప్పగించాలని, లేకుంటే తామే ఇంట్లోకి వెళ్తామని ఆందోళనకారులు పోలీసులను హెచ్చరించారు. ఈ క్రమంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకుంటానని పెట్రోలు సీసా చూపించగా, పోలీసులు అతనికి సర్దిచెప్పారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా పోలీసులు అప్పలనాయుడు, ఆయన భార్య చిన్నమ్మిలను ఇంటి వెనకవైపు నుంచి పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లారు.