విజయనగరంలోని ప్రధాన రహదారి, ఎత్తు బ్రిడ్జ్ కూడలినుంచి మయూరి కూడలి వరకు నిర్మించాల్సిన అప్రొచ్ మార్గాన్ని వెంటనే నిర్మించాలని తెదేపా నేతలు డిమాండ్ చేశారు. ఈ విషయమై.. కలెక్టర్ హరి జవహర్ లాల్‌కు వినతిపత్రం అందజేశారు. తెదేపా జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజు, విజయనగరం నియోజకవర్గ బాధ్యులు అతిధి గజపతిరాజు ఆధ్వర్యంలో.. నేతలు కలెక్టర్ ను కలిశారు. నగరంలోని ఎత్తు బ్రిడ్జి కూడలి నుంచి మయూరి జంక్షన్ వరకు వాహనాలు రాకపోకలకు గత ప్రభుత్వం అండర్ పాస్, అప్రోచ్ రోడ్డు మంజూరు చేసిందని గుర్తు చేశారు.
ఆ పనుల కోసం అప్పుడే 5 కోట్ల రూపాయల నిధులను సైతం కేటాయించారన్నారు. వంతెన పూర్తై రెండేళ్లు గడుస్తున్నా... అప్రోచ్ రోడ్డు నిర్మించలేదని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. నిర్మాణ పనులు అసంపూర్తిగా వదిలేయటం వల్ల విశాఖ నుంచి విజయనగరం పట్టణంలోకి వచ్చే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విన్నవించారు. తగిన చర్యలు తీసుకుని... పెండింగ్ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కోరారు.