వైకాపా అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 124 ఆలయాల్లో దాడులు జరిగితే.. సీఎం జగన్ ఏనాడూ స్పందించలేదని తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కరినీ పట్టుకోలేకపోయారని దుయ్యబట్టారు. విజయనగరం జిల్లా రామతీర్థంలో కొండపైన ప్రాంతాన్ని పరిశీలించిన తర్వాత బహిరంగ సభలో మాట్లాడిన అచ్చెన్నాయుడు, అశోక్ గజపతి రాజు.. ప్రణాళిక ప్రకారమే దేవాలయాలపై దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు.
ఆలయాలపై దాడులు చేసిన వారిని ఎందుకు అరెస్టు చేయడం లేదని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నిలదీశారు. 19 నెలలుగా కులాలు, మతాల వారీగా రాష్ట్రాన్ని విభజించారని విమర్శించారు. ఘటన జరిగిన 4 రోజులకు దేవుడు గుర్తుకొచ్చాడా అని వైకాపాను ప్రశ్నించారు. వైకాపా నేతలు చేస్తున్న పనులను.. తమ పార్టీ, నేతలకు ఆపాదిస్తున్నారని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల వ్యవహారాలను దొంగకు అప్పగించారని అచ్చెన్న ఆరోపించారు.