విజయనగరం జిల్లా రామతీర్ధం ఘటనలో పోలీసులు బుధవారం అరెస్టు చేసిన తెదేపా విజయనగరం పార్లమెంట్ టీడీపీ మహిళా అధ్యక్షురాలి భర్త సువ్వాడ రవిశేఖర్ అస్వస్థతకు గురయ్యారు. అతనిని చికిత్స నిమిత్తం పోలీసులు జిల్లా కేంద్రంలోని మహారాజ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులతో పాటు., పలువురు తెదేపా నేతలు ఆయనను పరామర్శించారు.
విజయనగరం గ్రామీణ ఠాణాలో తెదేపా నేతకు అస్వస్థత - పోలీస్ స్టేషన్లో తెదేపా నేత అస్వస్థత
రామతీర్థం ఘటనపై అరెస్టై విజయనగరం గ్రామీణ ఠాణాలో ఉన్న తెదేపా నేత రవిశేఖర్ ఈ రోజు ఉదయం అస్వస్థతకు గురయ్యారు. చికిత్స నిమిత్తం అతనిని జిల్లా కేంద్రంలోని మహారాజ ఆసుపత్రికి తరలించారు.
ఈ నెల 2న రామతీర్ధం ఘటనలో వైకాపా నేత విజయసాయిరెడ్డి ఫిర్యాదు మేరకు బుధవారం రాత్రి తెదేపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కిమిడి కళావెంకటరావు తోపాటు తెదేపాకు చెందిన మరో ఏడుగురిని అరెస్టు చేశారు. విచారణ అనంతరం కళా వెంకటరావుని చీపురుపల్లి పోలీసుస్టేషన్ నుంచి విడుదల చేశారు. విజయనగరం పార్లమెంట్ టీడీపీ మహిళా అధ్యక్షురాలి భర్త సువ్వాడ రవిశేఖర్తో పాటు, నెల్లిమర్ల మండలానికి చెందిన రామకృష్ణ, పైడినాయుడు, జగన్నాథం, శ్రీహరి, నాగరాజులను అరెస్టు చేసి విజయనగరం గ్రామీణ పోలీసుస్టేషన్లో ఉంచారు. వీరిలో సువ్వాడ రవిశేఖర్ ఈరోజు ఉదయం అస్వస్థతకు గురయ్యారు. పోలీసుల తీరుపై తెదేపా నేతలు మండిపడ్డారు. ప్రభుత్వం తెదేపా నాయకులు, కార్యకర్తలపై కక్ష సాధింపుతో వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు.
ఇదీ చదవండి:విజయనగరంలో ఇంటింటికీ రేషన్ పంపిణీ వాహనాల ప్రారంభం