Super-60: కరోనా మహమ్మారి పాఠశాల విద్యపై పెను ప్రభావం చూపింది. రెండేళ్లుగా విద్యార్థుల చదువులు సక్రమంగా సాగలేదు. వరుసగా తరగతులు జరగకపోవడం, పరీక్షలు రద్దవడం, ఈ ఏడాది వార్షిక పరీక్షలు రాసే పిల్లలపై ప్రతికూల ప్రభావం పడింది. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థుల ఆందోళనను దూరం చేసి వారిని వార్షిక పరీక్షలకు సంసిద్ధులను చేసేలా విజయనగరం జిల్లా అధికారులు చర్యలు చేపట్టారు. కస్తూర్బా పాఠశాలల్లో సూపర్-60 పేరుతో వినూత్న బోధనకు శ్రీకారం చుట్టారు.
కస్తూర్బా పాఠశాలల్లో "సూపర్" బోధన విజయనగరం జిల్లాలో 33 కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఈ ఏడాది 13 వందల మంది విద్యార్ధులు పదో తరగతి పరీక్షలు రాయబోతున్నారు. వీరంతా కరోనా వల్ల రెండేళ్లుగా పూర్తిస్థాయి బోధనకు దూరమయ్యారు. ఈ నేపథ్యంలో వార్షిక పరీక్షలను ఎలా ఎదుర్కోవాలన్న ఆందోళన విద్యార్థుల్లో నెలకొంది. దీనిని సరిదిద్ది పిల్లలను వార్షిక పరీక్షలకు సంసిద్ధులను చేసేందుకు సమగ్రశిక్ష పథకం సహాయ సంచాలకులు సూపర్-60 పేరుతో వినూత్న బోధనకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా 33 కస్తూర్భా విద్యాలయాల నుంచి ప్రతిభ గల విద్యార్ధులను 120మందిని ఎంపిక చేశారు. వీరిని రెండు బ్యాచ్‌లుగా విభజించి జనవరి 9 నుంచి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఎంపిక చేసిన విద్యార్ధులకు సూపర్-60 కేంద్రాల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. వీటిల్లో మెరుగైన బోధన కోసం 10 మంది సబ్జెక్టు నిపుణులను డిప్యుటేషన్ పై నియమించారు. విద్యార్దుల్లో ఆరోగ్యకరమైన పోటీ ఉండేలా పిల్లలను గురువులు ప్రోత్సహిస్తున్నారు. కేవలం పాఠాలు బోధించడమే కాక, ఒత్తిడిలేకుండా పరీక్షలను ఎలా ఎదుర్కోవాలో చెబుతున్నారు. పదో తరగతి పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణతతో పాటు ట్రిపుల్ ఐటీకి ఎక్కువ మంది ఎంపికయ్యేలా శిక్షణ ఇవ్వడమే తమ లక్ష్యమని గురువులు అంటున్నారు.
సూపర్ -60 ఆలోచన, కార్యచరణకు విద్యార్థులు ఫిదా అవుతున్నారు. వార్షిక పరీక్షలపై గతంలో తీవ్ర ఆందోళన ఉండేదని, అందులోనూ కొత్త విధానం ఈ ఏడాది నుంచి అమలవడం మరింత భయాన్ని కలిగించిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సూపర్-60 ఒక వరమని హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కరోనా వల్ల పాఠశాలల్లో విడతల వారీగా తరగతులు నిర్వహించారు. దీని వల్ల సిలబస్ పూర్తి కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో సూపర్-60 ..వినూత్న బోధన విద్యార్ధుల్లో నైతిక స్థైర్యాన్ని పెంపొందించిందని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: TDP Protest: జే బ్రాండ్‌తో సీఎం జగన్ జనాల ప్రాణాలు తీస్తున్నారు: తెదేపా