రాష్ట్రంలోనే గ్రీన్ జోన్ పరిధిలో ఒక్క విజయనగరమే నిలిచింది. దీన్ని కాపాడేందుకు జిల్లా యంత్రాంగం శ్రమిస్తోంది. తాజాగా పక్కనే ఉన్న శ్రీకాకుళంలో కేసులు నమోదవ్వటంతో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. సరిహద్దులను పూర్తిస్థాయిలో మూసేశారు. మరింత నిఘా ఏర్పాటు చేశారు.
ఇప్పటి వరకు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు కొంతవరకు రాకపోకలు జరిగాయి. తాజాగా శ్రీకాకుళంలో కేసులు వెలుగులోకి రావటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి ఎవరినీ అనుమతించకూడదని నిర్ణయించుకున్నారు. అత్యవసర పరిస్థితుల్లోనే తప్ప ఇతర సమయాల్లో వస్తే కచ్చితంగా జైలుకు పంపుతామని ఎస్పీ బి.రాజకుమారి హెచ్చరించారు.
మూడువేల మందితో
నాలుగు అంతర రాష్ట్ర, ఎనిమిది అంతర జిల్లాల, 28 అంతర్గత చెక్‌పోస్టులతో సుమారు మూడువేల మంది పహారా కాస్తున్నారు. ఈ చెక్‌పోస్టుల వద్ద పరిస్థితిని సీఐ పర్యవేక్షించనున్నారు. ఇకపై ఎవరు రావాలన్నా, పోవాలన్నా నేరుగా ఎస్పీతో సంప్రదించాకే అనుమతులు ఉంటాయి.
వివిధ దేశాల నుంచి ఇక్కడకు...
వివిధ దేశాల నుంచి 434 మంది ఇక్కడకు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే వైద్య పరీక్షలు నిర్వహించారు. తాజాగా శ్రీకాకుళంలో కేసుల తీరు నేపథ్యంలో ఒకసారి వీరందర్నీ పరీక్షించేందుకు సన్నద్ధమవుతున్నట్లు వైద్యవర్గాలు చెబుతున్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు 2,568 అనుమానితుల నుంచి రక్తనమూనాలు సేకరించారు. నెగెటివ్ వచ్చినా వీరిపై దృష్టి సారించనున్నారు