విజయనగరం జిల్లా మెంటాడ మండలం జక్కువ, కుంటినవలస గ్రామాల్లో వింతవ్యాధితో వీధికుక్కలు(street dogs) మృత్యువాత పడుతున్నాయి. వారం రోజుల వ్యవధిలో.. 30 కుక్కలు చనిపోవడం స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. జక్కువలో రోజుకు సగటున నాలుగు శునకాలు మరణిస్తున్నాయని గ్రామస్థులు తెలిపారు. వింత వ్యాధి ఆందోళనతో పిల్లలను బయటకు పంపేందుకు గ్రామస్తులు బయపడుతున్నారు. వెంటనే అధికారులు స్పందించి.. శునకాల మరణానికి గల కారణాలను గుర్తించి.. నివారణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
మృతి చెందిన కుక్కల నమూనాలను పరీక్షలకు పంపినట్లు స్థానిక పశువైద్యాధికారి తెలిపారు. కుక్కలు మృత్యువాత పడుతున్న విషయాన్ని జిల్లా అధికారులు దృష్టికి తీసుకెళ్లామన్నారు. పరీక్ష ఫలితాలు వచ్చిన తర్వాత వ్యాధి నిర్ధరణ చేసి.. నివారణ చర్యలు చేపడతామని వైద్యాధికారులు తెలిపారు.