అధికారపార్టీలో ముదిరిన వర్గపోరు Class War in YCP: ఎన్నికల సమయం దగ్గర పడుతున్నకొద్దీ అధికార పార్టీలో వర్గపోరు ముదురుతోంది. కీలక నేతలు ఎవరికివారు వర్గాలుగా విడిపోయి.. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ద్వితీయ శ్రేణి నాయకులు ఎవరిపక్షాన నిలబడాలో తెలియక అయోమయంలో పడిపోతున్నారు. తాజాగా విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
పొరుగు నియోజకవర్గం నుంచి వచ్చినా కష్టపడి గెలిపించి ఎమ్మెల్యేను చేస్తే.. సొంతపార్టీ నేతలపైనే కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని ఓ వర్గం ఆరోపిస్తే.. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నవారిని కాదని, ఎన్నికల ముందు వచ్చినా కీలకమైన ఎమ్మెల్సీ పదవి ఇస్తే ఇప్పుడు సొంతపార్టీకే నష్టం చేస్తున్నారని మరో వర్గం దీటుగా బదులిస్తోంది. ఇదీ జిల్లాలోని శృంగవరపుకోటలో అధికారపార్టీ ముఖ్యనేతల మధ్య కొన్ని నెలలుగా సాగుతున్న వర్గపోరు.
ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు రెండు వర్గాలు విడిపోయారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ ఎదుటే ఆయా వర్గాల అనుచరులు బహిరంగంగానే విమర్శించుకుంటున్నారు. ఎమ్మెల్యే కడుబండి సామాజిక వర్గానికే కీలక పదవులన్నీ ఇచ్చుకున్నారని ఎమ్మెల్సీ వర్గీయుల ఆరోపణ. విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర ఇంఛార్జీగా ఉన్న సమయంలో తనకు తెలియకుండానే ఆ నామినేటెడ్ పోస్టులన్నీ కట్టబెట్టారని ఎమ్మెల్యే వివరణ ఇచ్చుకున్నా.. వివాదం సద్దుమణగలేదు.
ఎమ్మెల్సీ రఘురాజు సొంత మండలం ఎస్.కోట కావడంతో ఇక్కడ పార్టీ రెండుగా చీలిపోయింది. ఎంపీపీ, జడ్పీటీసీ, మేజర్ పంచాయతీ సర్పంచ్ తో పాటు.. కొంతమంది నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేను బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు. తాజాగా ఓ ప్రైవేట్ లేఅవుట్ ఇరువర్గాల మధ్య మరోసారి చిచ్చురేపింది. లే అవుట్ యాజమాన్యాన్ని బెదిరించి కొందరు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ఎమ్మెల్సీ రఘురాజు బహిరంగ విమర్శలు చేయగా.. ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుంటున్న అధికారులను ఎమ్మెల్సీ భయపెడుతున్నారని ప్రత్యర్థి వర్గం విమర్శలు గుప్పించింది. జిల్లా నేతలు ఇరువర్గాలకు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
మరోవైపు అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలో శనివారం.. వైసీపీ పార్టీకి చెందిన రెండు వర్గాల నేతల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు వర్గాలకు చెందిన నాయకులు కర్రలు, రాడ్లతో పరస్పరం దాడులకు తెగబడ్డారు. దీంతోపాటు ఒకరిపై ఒకరు పిడిగుద్దులకు పాల్పడుతూ.. బీభత్సం సృష్టించారు. దీంతో రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వీరిని ఆపేందుకు ఎంతమంది ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీనిపై సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అయితే అధికారుల ఎదుటే.. వారు పరస్పర దాడులు చేసుకున్నారు. మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.