Rajam Palakonda Road : ఆ రహదారిలో ప్రయాణమంటే హడలిపోవాల్సిందే. ఎక్కడికక్కడ గుంతలు, వాటిలో చేరిన నీటితో చెరువులను తలపిస్తున్నాయి. ఆ దారిలో ప్రయాణం వాహనదారులకు ఓ సాహసం అనే చెప్పాలి. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజాం-పాలకొండ ప్రధాన రహదారిపై నెలకొన్న దుస్థితి ఇది.
20 కిలోమీటర్ల పొడవునా ఇదే పరిస్థితి:రాజాం నుంచి పాలకొండ వరకు 20 కిలోమీటర్ల పొడవున రోడ్డు ఉంది. రాజాం అంబేడ్కర్ కూడలి నుంచే మొదలయ్యే గుంతలు రాజాం పట్టణం పొడుగునా దర్శనమిస్తున్నాయి. పాలకొండ రహదారి పూర్తిగా పాడైపోయి అడుక్కొక గొయ్యి దర్శనమిస్తోంది. ఇక వర్షపు నీరంతా గుంతల్లో చేరి చెరువులను తలపిస్తున్నాయి. రాత్రివేళ ఈ రహదారిలో ప్రయాణం అంటే నరకయాతన తప్పదనే చెప్పాలి. సాధారణంగా రాజాం నుంచి పాలకొండ చేరేందుకు 30 - 40 నిమిషాలు సమయం పడుతుంది. రహదారి పొడవునా గుంతలు ఉండడంతో గంటన్నర సమయం పడుతోందని ప్రయాణికులు చెబుతున్నారు.