విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం పెద్ద బండపల్లి గ్రామానికి చెందిన దేవాబత్తుల సునీల్... వైజ్ఞానిక ప్రదర్శనలో అంతర్జాతీయ పురస్కారం దక్కించుకున్నాడు. సునీల్ తల్లిదండ్రులు మల్లయ్య-దేవి కూలీ పనులు చేస్తూ... జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివిస్తున్నారు. సునీల్ మొదట్నుంచి సైన్స్... ఎలక్ట్రికల్ అంశాలపై ఆసక్తి కనబర్చేవాడు. ఇది గుర్తించిన ఉపాధ్యాయులు... సునీల్‌ను వైజ్ఞానిక ప్రదర్శనకు సిద్ధం చేశారు.
తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో... విద్యుత్ పొదుపు పరికరాన్ని రూపొందించాడు సునీల్. రైల్వేస్టేషన్, బస్టాండ్‌లో ప్రయాణికులు లేకపోయినా... ఫ్యాను తిరుగుతూ... విద్యుత్ వృధా అవుతున్న విషయాన్ని గుర్తించి... నివారణకు ఆలోచన చేశాడు. విద్యుత్‌ను ప్రయాణికులు కూర్చున్న కుర్చీలకు అనుసంధానం చేశాడు. కుర్చీలో కూర్చోగానే ఫ్యాన్ తిరిగేలా... లేవగానే ఆగేలా ఏర్పాటు చేశాడు. ఈ ప్రయోగానికి జిల్లాస్థాయిలో మంచి గుర్తింపు వచ్చింది.