తలసేమియా, సికిల్ సెల్ అనీమియా బారినపడుతున్న వారి సంఖ్య నానాటికి పెరుగుతోంది. దేశవ్యాప్తంగా ఏడాదికి పదివేల మంది ఈ వ్యాధితో జన్మిస్తుంటే.. తెలుగు రాష్ట్రాల్లో సుమారు రెండు వేల మంది ఉన్నట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. క్షేత్రస్థాయిలో మరింత అధికంగా ఉండొచ్చు. ప్రధానంగా చిన్నారుల పాలిట ప్రాణాంతకరంగా మారింది ఈ వ్యాధి. ఒక్కసారి సోకితే., జీవితాంతం వారిని పీల్చిపిప్పి చేసే రక్త పిశాచి వ్యాధి ఇది. దురదృష్ణం ఏమిటంటే.. కన్నవారి ద్వారానే ఈ ప్రాణాంతక వ్యాధి సంక్రమిస్తుంది.
వ్యాధి తీవ్రత..
ఈ వ్యాధి బారినపడిన వారిలో క్రమంగా రక్త నిల్వలు పడిపోతాయి. శరీరానికి అవసరమైనంత మేర హిమోగ్లోబిన్ ఉత్పత్తి కాదు. ఉత్పత్తి జరిగినా.. ఎక్కువ కాలం శరీరంలో ఉండదు. ఫలితంగా హిమోగ్లోబిన్ నిల్వలు దారుణంగా పతనమవుతాయి. రక్తం శాతం పతనమైన ప్రతిసారి కృత్రిమంగా అందించాల్సి ఉంటుంది. ఇలా తరచూ రక్తం ఎక్కించటం వల్ల బాధితుల్లో ఐరన్ నిల్వలు పెరిగిపోతు.. కాలేయం, మూత్రపిండాలు, గుండె దెబ్బతినటం మొదలౌతుంది. ఈ పరిస్థితుల్లో బాధితుల చిన్నారులకు రక్తం ఎక్కించిన ప్రతిసారి ల్యూకో డీప్లీషన్ ఫిల్టర్స్ ద్వారా రక్త శుద్ధి చేయాలి. దాత నుంచి స్వీకరించిన రక్తంలోని ఐరన్‌ను తొలగించి, హిమోగ్లోబిన్ మాత్రమే ఎక్కించాల్సి ఉంటుంది. దీనితో పాటు.. ఐరన్, కెలేషన్ థెరఫి జరగాలి.
అంతేకాదు.. ఆరు నెలలకు ఒకసారి... ఐరన్ స్థాయిలు తెలుసుకోవాలి. మూత్రపిండాలు, గుండె పనితీరునీ పరీక్షిస్తూ ఉండాలి. ఈ వైద్య సేవలకు నాలుగైదు వేల రూపాయల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంతేకాదు.. రోజుల తరబడి పట్టణాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో బాధిత కుటుంబాలు ఎన్నో వ్యయప్రయాసలకు గురవుతూ.. ఆర్థికంగా పతనమౌతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఐటీడీఏ పరిధిలోని బాధితులకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో ప్రయోగాత్మకంగా డే కేర్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది.