విజయనగరంజిల్లా పార్వతీపురం డివిజన్‌లో సాగు ప్రాజెక్టులు ఉండటం వల్ల వరిసాగు ఆశాజనకంగా ఉన్నా.. విజయనగరం డివిజన్లో పొలాలన్నీ వర్షాధారం. చాలా మండలాలో నారును రక్షించుకోవడం కష్టం అవుతోంది. జులై మొదటి వారంలో కాస్త వర్షం కురిసినా.. తరువాత చినుకు జాడ కరవైంది. జూన్, జూలై నెలలో కలిపి 16 మిల్లీమీటర్ల లోటు వర్షపాతం నమోదైందని లెక్కుల చెబుతున్నాయి. గజపతినగరం మండలం మినహా మిగిలిన 33 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది.
ఖరీప్ సీజన్లో అన్ని పంటలూ కలిపి 1.73 లక్షల హెక్టార్లలో సాగు కావాల్సి ఉండగా.. ఇప్పటి వరకూ 56,775 హెక్టార్లలో మాత్రమే సాగు అయ్యింది. 1.18 లక్షల హెక్టార్లలో వరి నాట్లు వేయాల్సి ఉండగా.. కేవలం 52వేల హెక్టార్లలోనే సాగైందంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. అడపాదడపా వర్షాలకు సాగు చేసిన పంటలను కాపాడుకునేందుకు ఇంజన్ మోటర్లతో.. కిలోమీటర్ల కొద్ది పైపులు వేసి పంటలను తడుపుతున్నారు. డిజల్ ధరలు పెరిగిన నేపథ్యంలో నీటి తడులకు పంట పెట్టుబడుల కంటే.. అధికంగా ఖర్చు చేయాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు.