ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చరిత్ర చాటాల్సిన మన శిల్పారామం.. నాలుగేళ్లయినా ఇంకా అలానే..!

విజయనగరం జిల్లాలో సాంస్కృతిక వైభవం చాటాల్సిన శిల్పారామం ఇంకా ఓ రూపుదిద్దుకోలేదు. నాలుగేళ్ల క్రితం పనులు ప్రారంభమైనా ఇప్పటికీ కొలిక్కి రాలేదు. కళాత్మకత ఉట్టిపడేలా లోపల ఏర్పాట్లు చేస్తున్నా.. ఈ కళావేదికను చేరుకొనేందుకు దారి కూడా సరిగాలేదు. ఎప్పటికి ప్రారంభ మవుతుంద్నదానిపై ఓ స్పష్టత లేదు.

Shilparam is still the same
నాలుగేళ్లయినా ఇంకా అలానే మన శిల్పారామం

By

Published : Oct 1, 2020, 12:44 PM IST


జిల్లా కేంద్రంలోని వ్యాసనారాయణ మెట్ట దగ్గర శిల్పారామ నిర్మాణానికి మొత్తం 41 ఎకరాలను సిద్ధం చేశారు. మొదటి దశ కింద 8 ఎకరాల్లో అభివృద్ధి చేయడానికి రూ.1.90 కోట్లను కేటాయించారు. 2016 అక్టోబరులో పనులు ప్రారంభించినా... ఇంకా పూర్తికాలేదు. ఉన్నతాధికారుల నుంచి సరైన మార్గదర్శకాలు రాక మిగిలిన పనులు ముందుకు సాగడం లేదని నిర్వాహకులు చెబుతున్నారు. ఇది పూర్తయితే అనేక మందికి ఉపాధి దొరికే అవకాశం ఉంది.


ఎప్పటికి పూర్తవునో..

పచ్చని గ్రామీణ వాతావరణం ఉట్టిపడేలా, పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచే విధంగా ఉండాలన్న లక్ష్యంతో నిర్మాణం ప్రారంభించారు. తొలి విడతగా ప్రధాన ద్వారం, పరిపాలనా భవనం, చేతి వృత్తుల వారికోసం పది స్టాళ్లు, ఫుడ్‌కోర్టు, ఓపెన్‌ ఆడిటోరియం, చిన్నారుల ప్లేగ్రౌండ్, మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. మిగిలిన పనులు ఎప్పుడు పూర్తవుతాయో తెలియని పరిస్థితి. వాటి గురించి పట్టించుకున్నవారు లేరు. దీనిపై శిల్పారామం ఏఈ రమణ మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మిగిలిన పనులను పూర్తిచేస్తామని తెలిపారు.

శిల్పారామ క్షేత్రానికి చేరుకోవడానికి సరైన రహదారి లేదు. ప్రస్తుతమున్న మట్టి రోడ్డు అధ్వానంగా మారింది. ఇరువైపులా చెత్త, వ్యర్థాలు పేరుకుపోవడంతో దుర్గంధం వ్యాపిస్తోంది. దీనిపై నగరపాలక సంస్థ పర్యవేక్షణ ఇంజినీరు కె.దిలీప్‌ స్పందిస్తూ.. రూ.1.10 కోట్లతో 900 మీటర్ల బీటీ రహదారి నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేశామన్నారు. వచ్చిన నిధుల మేరకు రోడ్డును నిర్మిస్తామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details