ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలమాంబ పూజలకు ముస్తాబైన శంబర - విజయనగరం జిల్లాలో పోలమాంబ జాతర వార్తలు

గిరిజనుల ఆరాధ్య దైవం, సిరులిచ్చే కల్పవల్లి, ఉత్తరాంధ్రుల ఇలవేల్పు అయిన శంబర పోలమాంబ అమ్మవారి జాతర విజయనగరం జిల్లాలో నేటి నుంచి ప్రారంభం కానుంది. జాతర ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు అధికారులు, గ్రామ పెద్దలు, కృషి చేస్తున్నారు. భక్తులకు దర్శనభాగ్యం కల్పించేందుకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం ఉదయం నుంచి ప్రత్యేక దర్శనం కల్పిస్తారు. ఇప్పటికే గ్రామానికి జాతర కళ వచ్చింది. దూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తున్నారు. అమ్మవారికి మొక్కులు చెల్లిస్తున్నారు. గ్రామంలో ఇంటింటికీ అమ్మవారి ఘటాలు తిరుగుతాయి.

Shambhara  Polamamba  jatara at vizianagaram
పోలమాంబ పూజలకు ముస్తాబైన శంబర

By

Published : Jan 25, 2021, 4:43 PM IST

విజయనగరం జిల్లా అట్టహాసంగా శంబర పోలమాంబ అమ్మవారి జాతర ప్రారంభమైంది. అమ్మవారికి కొంత ధాన్యాన్ని సమర్పించారు. రేపు గ్రామప్రజలందరూ కలిసి సిరిమానోత్సవం నిర్వహించనున్నారు.

గద్దె వద్ద రాసులు తొక్కుతూ..

జాతరలో భాగంగా సోమవారం రాత్రి అమ్మవారికి తొలేళ్ల ఉత్సవం నిర్వహించనున్నారు. గ్రామంలోని రైతులు పండించిన పంటలో మొదటగా అమ్మవారికి కొంత తీస్తారు. వాటిని గద్దె వద్దకు తీసుకువస్తారు. యువత, పెద్దలు పెద్ద సంఖ్యలో వచ్చి రాసులు తొక్కుతారు. ఈ విత్తనాల కోసం ప్రజలు, రైతులు పోటీపడతారు. సేకరించిన వాటిని విత్తనాల్లో కలుపుతారు. వాటిని పంటగా వేస్తే మంచి దిగుబడులు వస్తాయని గ్రామ ప్రజల విశ్వాసం. అనంతరం మంగళవారం సిరిమానోత్సవం నిర్వహించనున్నారు.

ఏర్పాట్లు పూర్తి...

వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కేంద్రం, వనంగుడి, చదురుగుడి క్యూలైన్ల వద్ద, రామాలయం వద్ద ఆరోగ్య తనిఖీ శిబిరాలను ఏర్పాటు చేయనున్నారు. వీటి దగ్గర ఫీడర్‌ అంబులెన్స్, మూడు చోట్ల 108లు సిద్ధంగా ఉంచుతామని వైద్యులు తెలిపారు.శంబర పోలమాంబ జాతర ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. సబ్‌ కలెక్టర్, పీవోల ఆధ్వర్యంలో ఆయా శాఖల అధికారులు, సిబ్బంది కలసి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. దేవదాయశాఖ ఆధ్వర్యంలో 40 మంది సిబ్బంది సేవలు అందించనున్నారు. క్యూలైన్లు పూర్తి చేశారు. చదురుగుడి, వనంగుడి వద్ద ఉచిత, రూ.10, రూ.50ల టిక్కెట్ల ద్వారా దర్శన ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఉచిత ప్రసాదంతో పాటు చిన్నారులకు పాలు, మంచినీళ్లు ఇవ్వనున్నారు. అమ్మవారి ప్రసాదం 80 గ్రాముల లడ్డూను రూ.15, 150 గ్రాముల పులిహోర రూ.10లకు విక్రయించనున్నారు. రెండు ఆలయాల వద్ద మరుగుదొడ్లను సిద్ధం చేశారు. క్యూలైన్ల వద్ద భక్తుల వినోదానికి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. భక్తులు తలనీలాలు సమర్పించేందుకు టెంట్లు, కూర్చొనే ప్రాంతాలను సిద్ధం చేశారు.

మక్కువ నుంచి కవిరిపల్లి దారిలో వచ్చే వాహనాలకు జిల్లాపరిషత్‌ పాఠశాల దగ్గరలో పార్కింగ్‌ స్థలం కేటాయించారు. మావుడిపల్లి నుంచి వచ్చే వాహనాలకు వెంగళరాయసాగర్‌ జలాశయం సమీపంలో, పెద్దవలస నుంచి వచ్చే వాహనాలకు వసతిగృహం సమీపంలో, చెముడు నుంచి వచ్చే వాటికి గోముఖి నది సమీపంలో స్థలాలను గుర్తించి బాగు చేశారు.

పరిశుభ్రత పనుల్లో సిబ్బంది నిమగ్నం

తాగునీటి సరఫరాకు పురపాలికల నుంచి నీటి ట్యాంకులను రప్పించారు. అగ్నిమాపక శకటం కూడా చదురు గుడి సమీపంలో ఉంచుతున్నారు. పంచాయతీ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులకు 180మంది సిబ్బందితో ఎప్పటికప్పుడు పనులు చేస్తామన్నారు. సాలూరు, బొబ్బిలి, పార్వతీపురం పురపాలిక, మేజర్‌ పంచాయతీల నుంచి ఈవో, ఈవోపీఆర్‌డీలు అందుబాటులో ఉండి పరిశుభ్రత పనులు పర్యవేక్షిస్తుంటారు. ఆదివారం కార్మికులు రోడ్లు, కాలువలు శుభ్రం చేశారు పరిశుభ్రత చర్యలు ముమ్మరంగా చేపట్టారు.

ఒకరోజే పోలమాంబ, ముత్యాలమ్మ జాతర

శంబర, కవిరిపల్లి, తోటవలస, సన్యాశిరాజపురం గ్రామాల్లో పోలమాంబ, ముత్యాలమ్మ జాతరలను ప్రధాన పండుగలుగా నిర్వహిస్తారు. వీరిద్దరినీ అక్కాచెల్లెళ్లగా కొలుస్తారు. మొదట్లో పోలమాంబ జాతర తరువాత వారం కవిరిపల్లిలో ముత్యాలమ్మ జాతర నిర్వహించేవారు. దూరప్రాంతాల నుంచి వచ్చే వారు శంబర సిరిమానోత్సవం తిలకించి ఇక్కడే ఉండేవారు. వారం పాటు ఉండటంతో సమస్యలు ఎదురైన నేపథ్యంలో ఒకే రోజు జాతరను నిర్వహిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.

అమ్మవారి దర్శనానికి బారులు

పోలమాంబ దర్శనానికి భక్తులు బారులు తీరుతున్నారు. ఆదివారం ఉదయం నుంచే వనంగుడి, చదురుగుడి ఆలయాలకు పెద్దఎత్తున పోటెత్తారు. ఏర్పాట్లపై ఈవో నగేష్, ఉత్సవ కమిటీ సభ్యులు పూడి దాలినాయుడుతో మాట్లాడారు.

శంబరకు అదనపు బస్సులు లేవు

25, 26 తేదీల్లో జరగనున్న శంబర జాతరకు భక్తులు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులను అదనంగా వేయడం లేదని సంస్థ ప్రాంతీయ ప్రబంధకుడు ఎ.అప్పలరాజు తెలిపారు. కొవిడ్‌ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. భక్తులు పరిస్థితిని అర్థం చేసుకుని సహకరించాలని తెలిపారు.

ఇదీ చూడండి.పిటిషన్ కొట్టి వేసిన ధర్మాసనం... యథావిధిగా జరగనున్న ఎన్నికలు

ABOUT THE AUTHOR

...view details