విజయనగరం జిల్లా గరివిడి మండలం బొండపల్లిలో వైఎస్సార్ పింఛన్ల పంపిణీలో అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధరణ కావడంతో.. సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ రేగాన శ్రీరామ్ సహా ముగ్గురు వాలంటీర్లను విధుల నుంచి తొలగిస్తూ కలెక్టర్ ఎం.హరిజవహర్‌లాల్ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై ప్రాథమిక విచారణ జరిపిన డివిజినల్ అభివృద్ధి అధికారి రామచంద్రరావు ఇచ్చిన నివేదిక ఆధారంగా విధుల నుంచి తొలగించడమే కాకుండా.. క్రిమినల్ కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు.
సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ రేగాన శ్రీరామ్, వాలంటీర్లు దాసరి రాంబాబు, గొట్టాపు శంకర్రావు, ఎల్.శ్రీనివాసరావు, ఎస్.హేమలత కలిసి రూ.1.47 లక్షలు మాయం చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. దివ్యాంగుడు నల్లబోలు రామారావు 2020 ఆగస్టులో మృతి చెందగా అతని పేరుతో తొమ్మిది నెలల పింఛను రూ.45 వేలు, బుద్దరాజు రమణమ్మ 2020 సెప్టెంబరులో చనిపోగా ఆమె పేరిట 9 నెలల మొత్తం రూ.20,250 దోచేశారు.