Science demonstration in Bobbili : తల్లిదండ్రుల జీవన శైలి పిల్లలపై ఎంతో ప్రభావం చూపుతుంది.. నేటి ఆధునిక సమాజంలో డబ్బు సంపాదన కోసం అధిక సమయం కేటాయిస్తూ తల్లిదండ్రులు పిల్లలకు సమయం కేటాయించడం లేదు.. దీంతో తమ పిల్లల్లో ఉన్న ప్రతిభ తల్లిదండ్రులకు తెలియకుండాపోతుంది. ప్రతి విద్యార్థిలో ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది.. దాన్ని గుర్తించినప్పుడే వారిలోని ప్రతిభ బయటపడుతుంది. నేటితరం పిల్లలు ఎక్కువగా సెల్‌ఫోన్‌కి అడిక్ట్ అయ్యి.. చదువును గాలికి వదిలేస్తున్నారు కానీ అందుకు భిన్నంగా.. విజయనగరం జిల్లా బొబ్బిలిలో శ్వేతా చలపతి సంస్థానం ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఈ రోజు నిర్వహించిన సైన్స్ ప్రదర్శనలో.. చిన్నారులు సుమారు 937 రకాల సైన్స్ పరికరాల నమూనాలను తయారుచేసి తమ ప్రతిభను చాటుకున్నారు.
జీవ శాస్త్రం, రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రాలకు సంబంధించిన ప్రదర్శనలు అందరి దృష్టిని ఆకట్టుకున్నాయి. సైన్స్‌కు ఉన్న ప్రాధాన్యతను అందరికీ తెలిసేలా చేశారు. విద్యార్థులు మెదడుకు పదునుపెట్టి పలు రకాల సైన్స్ నమూనాలు తయారు చేశారు. ఈ ప్రదర్శనలో ముఖ్యంగా రోబోటిక్స్ ఆర్టిఫిషియల్ నుంచి మార్స్ ఓవర్, మేకనం రోబోట్ క్వార్టర్ రోబోట్, స్మార్ట్ డ్రిప్ ఇరిగేషన్ సిస్టం, న్యూటన్ సిద్ధాంతం రసాయనాలు పీల్చే విధానం పర్యావరణంకి హాని కలిగించే నమూనాలు.. మానవ అస్తిపంజరం వ్యవస్థ, భౌగోళికం, నక్షత్రాలు పనిచేసే విధానం రసాయనాలు తయారీ వంటి నమూనాలు తయారు చేసి చూపరులను ఆకట్టుకున్నారు. అదునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని నమూనాల తయారు చేశారు. బొబ్బిలి డివిజన్ పరిధిలోని పలు పాఠశాల చెందిన చిన్నారుల హాజరై ఈ నమూనాలను తిలకించారు.