Sankranti celebrations: విజయనగరంలోని శిల్పారామంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు జరిగాయి. భోగి మంటలు, గంగిరెద్దు ఆటలు, రంగువల్లులు, కోలాటం.. సంప్రదాయ వంటకాల ప్రదర్శనతో సంబరాలు నగరవాసులను అలరించాయి. జిల్లా కలెక్టర్ సూర్యకుమారి ఆధ్వర్యంలో నిర్వహించిన... ఈ సంబరాల్లో శాసనసభ ఉప సభాపతి కోలగట్ల వీరభద్రస్వామి, ఎమ్మెల్సీ సురేష్, జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, మేజర్ విజయలక్ష్మీ., వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తొలుత భోగిమంటలతో వేడుకలను ప్రారంభించారు.
భోగిమంట అనంతరం నిర్వహించిన గంగిరెద్దు ఆటలో ప్రజాప్రతినిధులు, అధికారులు సందడి చేశారు. కోలాటం మధ్య శిల్పారామం ప్రధాన ద్వారం నుంచి సాంస్కృతిక వేదిక వద్దకు చేరుకున్నారు. సభా కార్యక్రమాల తర్వాత.. పతంగులను ఎగురవేసి.. సంప్రదాయ వంటకాల ప్రదర్శనను తిలకించారు. అంతకుముందు.. చేపట్టిన సభా కార్యక్రమాల్లో కలెక్టర్, డిప్యూటీ స్పీకర్, జడ్పీఛైర్మన్ మాట్లాడుతూ.. ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేశారు.