ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పసుపు రైతుల అవస్థలు చూసి పరిశ్రమ పెట్టా: సునీత - విజయనగరం వార్తలు

సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఓ మహిళ ప్రస్తుతం సుమారు ఏడాదికి రూ.7 కోట్ల టర్నోవర్​తో​ పరిశ్రమ నడిపే స్థాయికి ఎదిగారు. పరిశ్రమ నెలకొల్పి...పసుపు గ్రేడింగ్ చేసి ఇతర రాష్ట్రాలు, విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. అంతేకాకుండా సమీప గ్రామంలోని దాదాపు 60 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు. సాలూరులో పసుపు పరిశ్రమ నిర్వహణ ద్వారా విజయపథంలో నడుస్తున్న మహిళా పారిశ్రామికవేత్త సునీతపై ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం.

Saluru woman industrialist sunita
Saluru woman industrialist sunita

By

Published : Dec 15, 2020, 7:02 AM IST

నిరుద్యోగమే పరిశ్రమ పెట్టేందుకు నడిపించింది : మహిళా పారిశ్రామికవేత్త సునీత

1996లో సునీత తల్లిదండ్రులు కామేశ్వరి దేవి, సాంబశివరావు గుంటూరు నుంచి విజయనగరం జిల్లా సాలూరు వచ్చారు. ఇక్కడ కొంత భూమిని కౌలుకు తీసుకొని పసుపు పండించేవారు. అయితే ఆ పసుపునకు అంతగా గిట్టుబాటు ధర లభించేది కాదు. పసుపును పాలిష్ చేసేందుకు పరిసర ప్రాంతాల్లో పరిశ్రమలు లేకపోవడంతో నష్టాలు ఎదుర్కొన్నారు. సునీత వివాహం అనంతరం మద్రాసు వెళ్లిపోయారు. కొన్నాళ్ల తర్వాత భర్తతో పాటు సాలూరు తిరిగి వచ్చిన ఆమె... పరిసర ప్రాంత రైతులు పసుపు పాలిష్ చేసేందుకు అవస్థలు పడటం గమనించారు.

పాడేరు ఏజెన్సీ గ్రామాల్లో తిరిగి అక్కడా అదే సమస్య ఉందని సునీత గమనించారు. నిరుద్యోగ సమస్య కూడా ఎక్కువగా ఉందని గమనించిన ఆమె.. ఓ పరిశ్రమతో రెండు విధాలుగా పరిష్కారం చూపాలనుకున్నారు. పసుపు పాలిష్ చేసే పరిశ్రమ పెట్టేందుకు సిద్ధమయ్యారు. పెట్టుబడి కోసం ఎంతో శ్రమించారు. మొదట్లో పెట్టుబడి దొరకలేదు. అయినా పట్టు వదలకుండా పరిశ్రమ కోసం అనుమతులు, రుణం సంపాదించారు.

ఖాదీ గ్రామీణ పరిశ్రమల అభివృద్ధి సంస్థ ద్వారా రెండున్నర లక్షల రూపాయలు రుణసాయం పొందారు. దాంతో తన నివాసంలోనే పదిహేను ఏళ్ల క్రితం పసుపు పాలిష్, గ్రేడింగ్ పరిశ్రమ స్థాపించారు. క్రమంగా పసుపు రైతుల సంఖ్య పెరగడంతో ఇంటికి సమీపంలో మరో పెద్ద గోదామును నిర్మించారు. సొంతంగా పాడేరు, అరకు, సాలూరు ప్రాంతాల నుంచి పసుపు కొనుగోలు చేసి పాలిష్ చేయడంతో పాటు పౌడర్ చేసి ఇతర రాష్ట్రాల్లోని పలు కంపెనీలకు విక్రయిస్తున్నారు. ప్రస్తుతం ఈ పరిశ్రమలో 60 మంది ఉపాధి పొందుతున్నారు. ముఖ్యంగా ప్రకృతి సిద్ధంగా గిరిజనులు పండించే ఈ పసుపునకు ఇతర రాష్ట్రాల్లోనే కాక విదేశాల్లోనూ మంచి గిరాకీ ఉంది. ఆర్డర్లు పెరుగుతుండడంతో...మరో కొత్త యూనిట్​ నిర్మిస్తున్నట్లు సునీత తెలిపారు. కొత్త యూనిట్​ ద్వారా మరింత మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు ఆమె తెలిపారు.

ఇటు పరిశ్రమ నిర్వహణతో పాటు కుటుంబ బాధ్యతలను సునీత సమన్వయంతో నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రెండు పీజీలు చేసిన ఆమె...తన ఇద్దరి ఆడ పిల్లలకు మంచి విద్యాబుద్ధులు నేర్పుతున్నారు.

పరిస్థితులే మార్గనిర్దేశం

చిన్ననాటి నుంచి చూసిన కుటుంబ, సమాజ స్థితిగతులు, ఎదుర్కొన్న సమస్యలే...తనకు మార్గనిర్దేశం చేశాయని సునీత తెలిపారు. పరిశ్రమ స్థాపించిన మొదటి ఐదేళ్లు ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నానన్నారు. వాటిని అధిగమించడమే ఈ విజయానికి కారణమైందని సునీత చెప్పారు.

మహిళలకు ఉపాధి

మాకు ఉపాధి కల్పించి...కుటుంబాలను చక్కదిద్దుకునేందుకు సునీత మేడమ్ ఓ మార్గం చూపించారు. ఉపాధి కల్పించి, వచ్చిన డబ్బుల్ని పొదుపు చేసుకునేలా ప్రోత్సహిస్తున్నారు. ఈ రోజు మేము మూడు పూటలా అన్నం తింటున్నామంటే సునీత మేడమే కారణం. మా బతుకులకు భరోసా కల్పించారు.

---పరిశ్రమలో ఉపాధి పొందుతున్న మహిళలు

ఇదీ చదవండి :జగన్ దర్శకత్వంలో అంతులేని కథలా పోలవరం: దేవినేని

ABOUT THE AUTHOR

...view details